ఆంధ్రప్రదేశ్‌లో బ్రదర్ అనిల్ సమావేశాలు కలకలం రేపుతున్నాయి. విజయవాడలోని ఓ ప్రైవేటు స్థలంలో కొందరు బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. దీంతో బ్రదర్ అనిల్‌ కొత్త పార్టీ పెడుతున్నారంటూ ప్రచారం మొదలైంది.


పార్టీ కాదు ఉత్తుత్తి ప్రచారమే 


ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పార్టీ పెడుతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని బ్రదర్ అనిల్ ఖండించారు. ఏపీలో తాము ఎలాంటి పార్టి పెట్టడం లేదన్నారు.  ఇప్పుడు అలాంటి ఆలోచన తమకు లేదన్నారు అనిల్. ఇదంతా ఊహాగానాలేనంటూ కొట్టిపారేశారు. పార్టీ పెట్టే ఆలోచన ఉంటే కచ్చితంగా తానే మీడియా ముందుకు వచ్చి వెల్లడిస్తానన్నారు అనిల్.


సమస్యలు తెలుసుకున్నాం


క్రిస్టియన్‌ మైనారిటీలు చాలా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని అనిల్ తెలిపారు. జగన్ గెలుపు కోసం శ్రమించిన వారంతా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. వారి సమస్యలు ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. వాటిని తెలుసుకునేందుకు కొందరితో సమావేశమైనట్టు పేర్కొన్నారు. ఇంతలోనే పార్టీ పెడుతున్నట్టు ప్రచారం జరిగిపోయిందన్నారు. 


అప్పుడు ఉండవల్లితో భేటీ 


ఫిబ్రవరి 25న సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో కూడా బ్రదర్ అనిల్ సమావేశమయ్యారు. అదే సంచలనం అనుకుంటే ఇప్పుడు నేరుగా వివిధ వర్గాలతో సమావేశాలు ఇంకా కాక రేపుతున్నాయి. ఇంతకా అనిల్ టార్గెట్ ఎవరు? వాళ్ల తర్వాత స్టెప్‌ ఏంటన్న చర్చ నడుస్తోంది. 


జగన్‌కు కాదని తెలంగాణలో పార్టీ


ఇప్పటికే జగన్‌ను వ్యతిరేకిస్తూ సోదరి షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారు. వైఎస్‌ఆర్‌టీపీ పేరుతో అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. దీనిపై అప్పట్లో తీవ్ర డిస్కషన్ నడిచింది. తెలంగాణలో పార్టీ పెట్టడం తమకు ఇష్టం లేదని.. అయినా షర్మిల ముందుకెళ్లడం ఆమె సొంత విషయమని వైసీపీ తేల్చి చెప్పేసింది. ఆ పార్టీతో తమతకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. 


ఇప్పటికే దెబ్బతిన్న సంబంధాలు!


షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత జగన్, షర్మిల ఫ్యామిలీ మధ్య చాలా గ్యాప్ వచ్చిందన్న ప్రచారం జోరుగా సాగింది. పరిణామాలు కూడా అలానే కనిపించాయి. రాఖీ పౌర్ణమి రోజు కూడా జగన్, షర్మిల కలుసుకోలేదు. ఈ ప్రచారంపై క్లారిటీ రాకుండానే ఇప్పుడు ఏపీలో జరుగుతున్న సంఘటనలు మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. 


ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటారా?


బ్రదర్ అనిల్ విమర్శలు కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉన్నాయి. ఆయనతో భేటీకి వచ్చిన నేతలు కూడా నేరుగా ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. తాము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నామని.. వాటిని వివరించేందుకు జగన్ ప్రభుత్వం సమయం ఇవ్వడం లేదని గోడు వెల్లబోసుకున్నారు.