AP Budget 2022: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఏపీ శాసనసభ, శాసన మండలిని ఉద్దేశించి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తొలిసారి నేరుగా ప్రసంగించారు. కరోనా కారణంగా 2020, 2021 బడ్జెట్‌ సమావేశాలు వర్చువల్‌ విధానంలో గవర్నర్ ప్రసంగించారు. కరోనా వ్యాప్తి తగ్గడంతో నేడు నేరుగా ఉభయ సభలను ఉద్దేశించి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగంలో ఏపీ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రస్తావించారు.


గవర్నర్ గో బ్యాక్ అంటూ టీడీపీ నేతలు నినాదాల నడుమ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఏపీతో పాటు దేశమంతా ఎన్నో సవాళ్లను ఎదుర్కోంది. ఉద్యోగుల పదవి విరమణ వయసును 62కు పెంచారు. అన్ని ప్రాంతాల డెవలప్‌మెంట్ కోసం కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉగాది తెలుగు సంవత్సరం రోజున కొత్త జిల్లాలతో ఏపీలో కీలక పరిణామం మొదలవుతుంది. 11వ పీఆర్సీ నిర్ణయాన్ని అమలు చేశారు. పెన్షనర్లు, ఉద్యోగులకు దీని వల్ల ప్రయోజనం చేకూరింది. ఉద్యోగులకు సర్కార్ 23 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడం ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తుందన్నారు. 


ఈ ప్రభుత్వ పాలనతో మెరుగైన అభివృద్ధి..
రాష్ట్ర విభజన తరువాత 2014-19 అయిదేళ్ల కాలంలో విధానాలు కుంటుపడ్డాయి. ఆర్థిక తిరోగమనం రాష్ట్ర ఆర్థిక వనరులపై ప్రతికూల ప్రభావం చూపింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం కరోనా వ్యాప్తి సమయంలోనూ రాష్ట్రాన్ని  అభివృద్ధి పథంలో నడిపించింది. 2020-21లో 0.22 శాతం జీఎస్‌డీపీ డెవలప్‌మెంట్‌ను చూపించింది. దేశ వాస్తవ జీడీపీ 7.3 శాతం తగ్గగా, అదే సమయంలో ఏపీ రాష్ట్ర జీఎస్‌డీపీ స్థిర ధరలతో ఏటా 9.91 శాతం వృద్ధిని చూపింది. వికేంద్రీకరణ, సుపరిపాలనా లక్ష్యానికి అనుగుణంగా జిల్లాల పునర్ వ్యవస్థీకరణ చేపట్టాం. 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేయాలని ఉగాది నుంచి కొత్త జిల్లాల నుంచి పాలన జరుగుతుంది. 


ఒకేసారి 5 విడతల కరువు భత్యం విడుదల
23 శాతం ఫిట్‌మెంట్‌తో 11వ వేతన సవరణ అమలు
ఉద్యోగుల వయోపరిమితి 60 నుంచి 62 ఏళ్లకు పెంపు


ఆర్థిక వ్యవస్థ
గత ఏడాది తక్కువ వృద్ధి జరిగినా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంది. 2021-22కు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ముందస్తు అంచనాలు ప్రస్తుత ధరలతో 16.82 శాతం సమగ్ర వృద్ధి చూపాయి. తలసారి ఆదాయం గత ఏడాది రూ.1,76,707 ఉండగా 15.87 శాతం అధిక వృద్ధి రేటుతో ప్రస్తుతం రూ.2,04,758కి పెరిగింది.


లోకల్ టు గ్లోబల్
ఎస్‌డీజీలకు నవరత్నాలను మ్యాగింగ్, స్థానికీకరణ చేశాం. కరోనా సమయంలోనూ రైతులు, మహిళలు, చిన్నారులు, అణగారిన వర్గాలు, బలహీన వర్గాలు, విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారతపై అధిక ప్రమాణాలు పాటించాం. నవరత్నాలు ఫ్రేమ్ వర్క్ కింద యూఎన్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను (SDG) అంతర్లీనంగా అనుసరించాం. వారికి సాయాన్ని నేరుగా ఖాతాలోకి బదిలీ చేసి పారదర్శకతను పాటించాం. గ్రామ, వార్డు సచివాలయం, వాలంటీర్ వ్యవస్థలు ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేశాయి. 


వనబడి నాడు నేడు కింద 2020-21 నుంచి ప్రారంభిస్తూ 3 ఏళ్లలో అన్ని ప్రభుత్వ స్కూళ్లో మౌలిక సదుపాయాలను పటిష్టం చేస్తున్నారు. రూ.3,669 కోట్లతో మొదటి దశ కింద 15,715 స్కూళ్లను పూర్తి చేశాం. రాబోయే రెండేళ్లలో మిగిలిన 42,000 స్కూళ్లు, ఇతర విద్యా సంస్థలను పటిష్టం చేస్తాం. మూడు దశలలో ప్రభుత్వం రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తుంది. జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి కార్యక్రమాలు ప్రభుత్ం అమలు చేస్తోంది. ప్రభుత్వం, ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్లలో 1 నుంచి 10వ తరగతులలోని 47 లక్షల మంది విద్యార్థులకు 3 జతల యూనిఫాం, బెల్టు, జత బూట్లు, పుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఆక్స్ ఫర్డ్ ఆంగ్లం తెలుగు నిఘంటువు, బ్యాగ్ అందించాం. పౌష్టికాహార కోసం 1 నుంచి 10వ తరగతి పిల్లలు 43.26 లక్షల మందికి 2019 నుంచి ఇప్పటివరకూ జగనన్న గోరుముద్ద కింద రూ.2,640 కోట్లు ఖర్చు చేశాం. ఫీజు రీయింబర్స్ మెంట్ కింద ఇప్పటివరకూ 21.55 లక్సల విద్యార్థులకు రూ.6,259.72 కోట్ల మొత్తాన్ని జమ చేశాం. 


దేశంలో తొలిసారిగా అర్హత కలిగిన ప్రతి విద్యార్థికి ఏడాదికి రెండు దఫాలలో ఐటీఐ విద్యార్థులకు రూ.10,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15,000 , డిగ్రీలు, ఇతర కోర్సుల విద్యార్థులకు రూ.20,000 అందిస్తోంది. విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో 18.77 లక్షల అర్హులైన విద్యార్థులకు రూ.2304.97 కోట్ల మొత్తాన్ని అందించారు. 


ఆసరా పథకం నిధులు.. 
డా. వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకం కింద రోజుకు రూ.225 చొప్పున నెలకు రూ.5 వేలు గరిష్ట పరిమితితో 9.43 లక్షల కేసులకు ఆపరేషన్, పోషణ భత్యం రూ.517 కోట్లు సమకూర్చాం. 108 అంబులెన్సులు, 104 సంచార వైద్య యూనిట్లను పునరుద్ధరించాం. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 16 కొత్త వైద్య కళాశాలలకు ప్రతిపాదన. శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ పరిశోధనా కేంద్రం, డయాలసిస్ యూనిట్ తో కలుపుకుని 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.


వైఎస్సార్ రైతు భరోసా ద్వారా మూడు వాయిదాలలో 13,500 ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా 45 ఏళ్లు దాటిన మహిళలకు 75 వేల రూపాయల ఆర్ధిక సాయం అందిస్తున్నట్టు తెలిపారు. అలాగే ఆర్ధికంగా వెనుకబడిన కులాలకు కూడా ఏడాదికి 15 వేల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తున్నట్టు తెలిపారు. డీబీటీ ద్వారా లబ్దిదారుల ఖాతాల్లో 1,32,226 కోట్ల రూపాయల మేర బదిలీ చేసినట్టు గవర్నర్ తెలిపారు. మొత్తంగా పారదర్శక,అవినీతి రహిత పాలన అందిస్తున్నామన్నారు.  ఎన్డీబీ సాయంతో 6,400 కోట్ల రూపాయల వ్యయంతో రహదారుల అభివృద్ధి చేపట్టినట్టు వివరించారు. అలాగే రాష్ట్రంలోని రహదారుల మరమ్మత్తు కోసం కూడా ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. 


రహదారులు, రోడ్లకు నిధులు..  
రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు కేటాయించినట్టు వివరించారు. 9200 కిలోమీటర్ల గ్రామీణ రహదారుల 1073 కోట్ల వ్యయంతో మరమ్మత్తులు, అభివృద్ధి చేపట్టామని గవర్నర్ స్పష్టం చేశారు.  అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఆర్బీకేలు, గ్రామ సచివాలయాలు, డిజిటల్ లైబ్రరీల లాంటి  మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోందన్నారు. పోలవరం ప్రాజెక్టు లో 77 శాతం మేర పూర్తి అయ్యింది. 2023 నాటికి ప్రాజెక్టు మొత్తాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అలాగే జల్ జీవన్ మిషన్ ద్వారా గృహాలకూ కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు  తన ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. సుస్థిరాభివృద్ధి ఆర్ధిక లక్ష్యాలను అందుకునేందుకు సౌర, పవన విద్యుత్ లాంటి సంప్రదాయేతర ఇంధన వనరుల ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది.


ఉచిత విద్యుత్ 
వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ ప్రభుత్వం ఇస్తోంది. 25 ఏళ్ల పాటు నిరంతరాయంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించేందుకు గానూ సోలార్ పవర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నాం ఒక్కో యూనిట్ ను 2.5 రూపాయల చొప్పున కొనుగోలు చేసేందుకు అంగీకారం కుదిరిందని తెలిపారు. ఇందుకోసం 7500 కోట్ల రూపాయల మేర ఏడాదికి వ్యయం చేయాల్సి వస్తుందన్నారు. రాష్ట్రంలోని మూడు పారిశ్రామిక కారిడార్ ల ద్వారా వ్యూహాత్మక పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తుందని గవర్నర్ తెలిపారు. భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల నిర్మాణంతో పాటు దగదర్తి, భోగాపురం విమానాశ్రయం నిర్మాణాలపైనా తన ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. 


పరిశ్రలకు ప్రోత్సాహం..
7015 కోట్ల రూపాయల పెట్టుబడితో సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలు రాష్ట్రంలో ఉత్పత్తిని ప్రారంభించాయని గవర్నర్ వివరించారు. దేశంలో జరుగుతున్న ఎగుమతులకు 5.8 శాతం మేర పారిశ్రామిక ఎగుమతులు ఏపీ  నుంచి జరుగుతున్నాయన్నారు.  నేరాల విచారణలో ఏపీ  అగ్రస్థానంలో ఉందని .. మహిళలపై నేరాల్లో  దిశాయాప్ కీలకంగా మారిందని గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.