ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రాను రాను డైనమిక్‌గామారుతున్నాయి. అనూహ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బావ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఏపీలో రాజకీయ పార్టీ పెట్టబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. తర్వాత ఆయన అలాంటిదేమీ లేదని.. ఏమైనా ఉంటే తానే చెబుతానని క్లారిటీ ఇచ్చారు. కానీ రాజకీయాల్లో నిప్పు లేనిదే పొగ రాదు. పొగ వచ్చిందంటే ఏదో ఉందనే అర్థం. ఇప్పటికే ఈ పొగ ఏపీ రాజకీయాల్లో ఉంది. అందుకే బ్రదర్ అనిల్ పార్టీపై ఏపీలో ఆసక్తి ప్రారంభమైంది.
కలకలం రేపిన బ్రదర్ అనిల్ "రాజకీయ" సమావేశం
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అల్లుడిగా తెలుగు ప్రజలకు బ్రదర్ అనిల్ కుమార్ అందరికీ తెలుసు. అయితే ఆయనకంటూ క్రైస్తవసమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. మత ప్రచారకుడిగా ఆయనకు తెలుగురాష్ట్రాల్లో చాలా ఫాలోయింగ్ ఉంది. తెర వెనుక ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ... తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం క్రైస్తవ సమాజం మద్దతు కోసం చాలా ప్రయత్నాలు చేసేవారు. ఆయన కృషి ఫలితంగానే నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గెలవాలని.. ఇటీవల జగన్ గెలవాలని చర్చిల్లో ప్రార్థనలు కూడా చేశారని చెప్పకున్నారు. ఈ ప్రయత్నాల కారణంగానే బ్రదర్ అనిల్ కుమార్‌కు తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ సమాజంలో మంచి గుర్తింపు ఉంది. అయితే ఆయన ఇప్పటి వరకూ ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడూ పాల్గొనలేదు. రాజకీయాల గురించి మాట్లాడిందిలేదు. కానీ ఇటీవల మాత్రం ఆయన అడుగులు రాజకీయ పరంగానే కనిపిస్తున్నాయి.
అనిల్ పార్టీ పెట్టే అవకాశం ఎంత !?
బ్రదర్ అనిల్ ఇటీవల ఏపీలోనే ఎక్కువగా పర్యటిస్తున్నారు. ఓ సారి కృష్ణా జిల్లాలో పర్యటించారు. తర్వాత రాజమండ్రి వెళ్లి ఉండవల్లి అరుణ్ కుమార్‌తో సమావేశమయ్యారు. అప్పుడు కాస్త నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అన్ని విషయాలు త్వరలో తెలుస్తాయన్నారు. ఇప్పుడు విజయవాడలో నేరుగా వైఎస్ఆర్‌సీపీ గెలుపు కోసం ప్రయత్నించిన క్రైస్తవ, బీసీ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. అంతర్గత సంభాషణల్లో సొంత పార్టీ గురించి చెప్పినట్లుగా ఆ సమావేశంలో పాల్గొన్న నేతలు చెప్పారు. అయితే బహిరంగంగా మాత్రం అనిల్ కుమార్ ఈ ప్రచారాన్ని ఖండించారు. అయితే బ్రదర్ అనిల్ ఇప్పటి వరకూ రాజకీయంగా ఎలాంటి అడుగులు వేయలేదు. ఒక్క సారిగా పార్టీ ప్రారంభిస్తారా అని చాలా మంది ఆశ్చర్యపోయారు. నమ్మలేకపోయారు కూడా. కానీ వైఎస్ కుటుంబంలో గత కొన్ని నెలల పరిణామాలు చూస్తే కొట్టి పారేయలేమని కొంత మంది వాదిస్తున్నారు.
"ప్లాన్ బీ"లో భాగంగా షర్మిలనే ఏపీలో రాజకీయ పార్టీ పెట్టిస్తున్నారా ?
వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో ఆమె రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కొద్దిరోజుల కిందట ఆమె ఏపీరాజకీయాల్లోనూ అడుగుపెడతారన్న ప్రచారం జరిగింది. దానికి ఆమె వ్యాఖ్యలు కూడా కారణం అయ్యాయి.ఏపీలో పార్టీ పెట్టకూడదన్న రూలేమీ లేదు కదా అని ప్రశ్నించారు. అయితే తర్వాత కేవలం తాను రూల్ గురించి మాట్లాడానని.. తన రాజకీయ జీవితం పూర్తిగా తెలంగాణకే అంకితమని క్లారిటీ ఇచ్చారు. కానీ కుటుంబ వివాదాలు...తెలంగాణలో పార్టీకి లభించే ఆదరణ ఇలాంటివన్నీ బేరీజు వేసుకుని.. ప్రత్యామ్నాయంగా షర్మిలనే .. తన భర్తతో ఏపీలో పార్టీ ప్రారంభించే సన్నాహాలు చేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అసలేమీ లేకపోతే బ్రదర్ అనిల్ ఎందుకు సమావేశాలు పెడతారనేది ఇక్కడ ప్రధానంగా వస్తున్న మౌలికమైన ప్రశ్న.
బ్రదర్ అనిల్ ముందడుగు వేస్తే రాజకీయంగా కీలక పరిణామాలు !
బ్రదర్ అనిల్ కుమార్ ఏ ఉద్దేశంతో సమావేశాలు పెడుతున్నారో స్పష్టతలేదు. ఆ విషయం ఆయనే చెప్పాల్సింది. వైఎస్ఆర్‌సీపీ కోసం పని చేసినవారందరూ ఆవేదనకు గురవుతున్నారని ఆయన చెబుతున్నారు. ప్రచారం చేసి గెలిపించిన పార్టీకి వ్యతిరేకంగా సమావేశాలు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. త్వరలో మరికొన్ని ప్రాంతాల్లో సభలు పెడతారని అంటున్నారు. అదే జరిగితే ఖచ్చితంగా రాజకీయ ఉద్దేశంతోనే అని అనుకోవాలి. బ్రదర్ అనిల్ ముందడుగు వేస్తే ఏపీ రాజకీయాల్లో ఓ రకమైన కల్లోలం ఖాయమని అనుకోవచ్చు.