అమరావతి విషయంలో హైకోర్టు ( AP High Court ) తీర్పు తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా, అనధికారికంగా తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న ప్రకటనలు గందరగోళంగా ఉన్నాయి. పార్టీ పరంగా ఓ స్టాండ్.. ప్రభుత్వ పరంగా మరో విధానాన్ని అవలంభిస్తున్నారు. ఇది వ్యూహాత్మకమా ..? లేకపోతే తామే గందరగోళంలో ఉన్నారా ? అనే దానిపై ఎవరికీ స్పష్టత లేకుండా పోయింది. ప్రభుత్వ గత చర్యలను పరిశీలిస్తే ఏ క్షణం.. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని కొంత మంది విశ్లేషిస్తున్నారు.
పార్టీ పరంగా బలంగా మూడు రాజధానుల వాదన !
వైఎస్ఆర్‌సీపీ ( YSRCP ) తరపున బలంగా మూడు రాజధానుల వాదన వినిపిస్తున్నారు. తమ పార్టీ విధానం మూడు రాజధానులని ( Three Capitals ) మరో మాట లేకుండా చెబుతున్నారు. అమరావతి విషయంలో కోర్టు తీర్పుపై నేరుగా ఎలాంటి కామెంట్లు చేయనప్పటికీ చట్టం చేయకుండా నిలువరించడాన్ని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో తమ విధానం మూడు రాజధానులని.. చేసి తీరుతామని చెప్పడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. రాజకీయ పరంగా చాలా దూకుడుగా తమ వికేంద్రీకరణ వాదం వినిపిస్తున్నారు. వాస్తవానికి రాజకీయంగా ప్రకటనలకు తప్ప మూడు రాజధానులు అనేది సాధ్యం కాదని హైకోర్టు ఆదేశాలతో తేలిపోయింది. మరి మూడు రాజధానులు ఎలా ఏర్పాటు చేస్తారన్నది ప్రభుత్వం చెప్పాల్సి ఉంది. కానీ ప్రభుత్వానికీ ఆ విషయంలో క్లారిటీ ఉందని ఎవరూ అనుకోవడం లేదు. కేవలం రాజకీయం కోసమే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ఎక్కువ మంది నమ్ముతున్నారు.
చట్టం చేసే హక్కు లేదన్న హైకోర్టు తీర్పుపై ఘాటు వ్యాఖ్యలు !
అమరావతి ( Amaravati ) విషయంలో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే చట్టం చేసిందని.. ఇప్పుడా చట్టానికి భిన్నంగా మూడు రాజధానుల చట్టం చేసే హక్కు ఏపీ ప్రభుత్వానికి లేదని హైకోర్టు చెప్పింది. అయితే చట్టం చేసే హక్కు లేదని చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని వైఎస్ఆర్‌సీపీ నేతలు.. మంత్రులు ( Ministers ) కాస్త ఘాటు స్వరంతోనే స్పందించడం ప్రారంభించారు. అసెంబ్లీ ఉన్నది చట్టాలు చేయడానికేనని.. ప్రజలు తమను ఎన్నుకున్నది చట్టాలు చేయడానికేనని.. ఆ పని చేయవద్దని అంటే ఎట్లా అని ప్రశ్నించడం ప్రారంభించారు. హోంమంత్రి సుచరిత, ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు వంటి వారు నేరుగా హైకోర్టుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత మంత్రి బొత్స లాంటి వాళ్లు మరింత తీవ్రమైన విమర్శలు చేశారు.
అసెంబ్లీలో చర్చించడానికి సిద్ధమయ్యామనే సంకేతాలు !
అమరావతి విషయంలో హైకోర్టు తీర్పు, అందులోని చట్టం చేసే హక్కు లేదన్న అంశంపై అసెంబ్లీలో ( AP Assembly ) చర్చించాలని వైఎస్ఆర్‌సీపీ ప్రాథమికంగా నిర్ణయించుకుంది. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala ) ఈ విషయాన్ని మీడియా సమావేశంలో ప్రకటించారు. ఆ తర్వాత వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ( MLA Dharmana Prasadarao ) సీఎం జగన్‌కు నేరుగా లేఖ రాశారు. శాసన వ్యవస్థ అధికారాల్లోకి చొచ్చుకు వచ్చేలా హైకోర్టు తీర్పు ఉందని దీనిపై అసెంబ్లీలో చర్చించడానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. ఆయన లేఖలో రాజ్యాంగపరమైన అంశాలను కూడా గుర్తు చేశారు. అటు సజ్జల చెప్పినట్లుగానే ఇటు ధర్మాన లేఖ రాయడంతో ప్రభుత్వం అసెంబ్లీలో చర్చకు సిద్ధమయిందన్న సంకేతాలు వచ్చాయి.
గుంభనంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం !
అయితే అధికారికంగా ప్రభుత్వం మాత్రం గుంభనంగా వ్యవహరిస్తోంది. ఎక్కడా కోర్టు తీర్పును ( Court Verdict ) ధిక్కరిస్తున్నట్లుగా కానీ.. మరో విధంగా కానీ నిర్ణయాలు తీసుకోవడం లేదు. గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల ప్రస్తావన తీసుకు రాలేదు. కానీ వికేంద్రీకరణ అంశాన్ని ప్రస్తావించారు. వికేంద్రీకరణ పాలన చేస్తున్నామన్నారు. రాజధాని ప్రస్తావన తీసుకురాలేదు. తర్వాత అసెంబ్లీలో పెట్టాల్సిన బిల్లులు ఇతర అంశాలపై జరిగిన మంత్రి వర్గ సమావేశాల్లోనూ ఈ అంశంపై ఎలాంటి వివాదాస్పద నిర్ణయమూ తీసుకోలేదు. దీంతో ఇప్పటికిప్పుడు న్యాయవ్యవస్థపై అసెంబ్లీలో చర్చించేంత నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడం లేదని స్పష్టమయింది.ఈ విషయంలో ప్రభుత్వం కాస్త వెనకుడుగు వేసిందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రభుత్వానికి భిన్నమైన వ్యూహం ఉండే అవకాశం !
అమరావతి విషయంలో ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ చర్చల్లో పెట్టి నిర్ణయాలు తీసుకోలేదు. ఫటాఫట్ నిర్ణయాలు తీసుకుంది. ఎవరేమనుకున్నా పట్టించుకోలేదు. మొదటి సారి బిల్లులు పెట్టినప్పుడు.. తర్వాత సెలక్ట్ కమిటీలో ఉండగానే మరోసారి బిల్లులు ఆమోదించినప్పుడు.. తర్వాత వెనక్కి తీసుకున్నప్పుడు ఇలా అేక అంశాల్లో సడన్‌గా నిర్ణయాలు తీసుకున్నారు. రేపు న్యాయవ్యవస్థ పరిమితులపై అసెంబ్లీలో చర్చ విషయంలోనూ ఏపీ ప్రభుత్వం అంతే హఠాత్తుగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు రాసిన లేఖలో బడ్జెట్ సమావేశాల్లో చర్చించాలని చెప్పలేదు.. ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేయాలని కోరారు. ఆ ప్రకారం ప్రభుత్వం ముందు ముందు తన వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉందంటున్నారు.