Mlc Kavitha : చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని పూర్తిగా ఎత్తేయాలని మంత్రి కేటీఆర్ ఉత్తరాల ఉద్యమం ప్రారంభించారు. దీనికి అనూహ్య స్పందన వస్తుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యారు. మంత్రి కేటీఆర్ పిలుపుతో ప్రధాని మోదీకి పోస్ట్ కార్డు రాశారు. చేనేత వృత్తి అంటే వ్యాపారం కాదని, అది మన దేశ వారసత్వ కళాసంపదనని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. చేనేత కళాకారులంతా గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేదలు, బలహీన వర్గాలని, అలాంటి వారిని జీఎస్టీ పేరిట దోపిడీ చేయడం సరికాదన్నారు.  మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రద్దుచేయాలని ఆదివారం ప్రధాని మోదీకి ఎమ్మెల్సీ కవిత పోస్ట్ కార్డు రాశారు. చేనేత పరిశ్రమ చేనేత కళాకారుడి నైపుణ్యత, సృజనాత్మకత, కష్టంపై ఆధారపడి మనుగడ సాగిస్తున్నదన్నారు. చేనేత కళాకారుడిలో వ్యాపార దృక్పథం ఉండదని పేర్కొన్నారు.






జీఎస్టీ కార్మికుల పాలిట ఉరితాడు 


దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా ఏ ప్రభుత్వం చేనేత ముడి సరుకులపై, చేనేత వస్త్రాలపై ఎలాంటి పన్ను విధించలేదని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు. ఇప్పుడు మోదీ హయాంలోనికి కేంద్రం చేనేతకు వాడే ముడి సరుకులపై, చేనేత వస్త్రాలపై 5 శాతం జీఎస్టీ విధించి, దాన్ని 12 శాతానికి పెంచాలనుకోవడం చేనేత కార్మికుల పాలిట ఉరితాడు అవుతుందని  ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని కోట్లాది పేద చేనేత కార్మికుల జీవితాల కోసం,  చేనేత ముడి సరకులపై చేనేత వస్త్రాలపై విధించిన జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. చేనేత సంబంధిత వస్తువులపై జీఎస్టీని పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ  5% , 12% కాదని, 0% ఉండాలని సూచించారు. మరోవైపు మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో చేనేతపై జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ప్రతి ఒక్కరూ ప్రధానికి పోస్ట్ కార్డ్ రాయాలని కవిత కోరారు. 


మంత్రి కేటీఆర్ మరో ఉద్యమం 


చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రద్దు చేయాలని పోస్టు కార్డు ఉద్యమం ప్రారంభించిన మంత్రి కేటీఆర్ ఇవాళ ఆన్‌లైన్‌ పిటిషన్‌ మొదలుపెట్టారు. చేనేత కార్మికుల జీవితాన్ని కాపాడేందుకు, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడేందుకు చేనేత ఉత్పత్తులపై వస్తు, సేవల పన్ను తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. మంత్రి కేటీఆర్ ఛేంజ్‌ డాట్‌ ఆర్గ్‌లో ఆన్‌లైన్‌ పిటిషన్‌ పెట్టారు.  చేనేత రంగం అతిపెద్ద అసంఘటిత రంగాల్లో ఒకటన్న కేటీఆర్, గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధిల్లో చేనేత అంతర్భాగమన్నారు.  భారతదేశంలో చేనేత రంగం కోవిడ్‌ కారణంగా తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొందన్నారు. ఈ కష్టకాలంలో పన్ను పెంచే ఏ చర్య అయినా చేనేత రంగానికి మరణ శాసనం మోగిస్తుందన్నారు.