Turkey Hijab Row:


టర్కీలో హిజాబ్‌పై చర్చలు..


ఇరాన్‌లో హిజాబ్‌పై దాదాపు నెల రోజులుగా ఉద్యమం కొనసాగుతూనే ఉంది. ప్రపంచ దేశాలు ఇరాన్ తీరుపై మండి పడుతున్నాయి. ఈ క్రమంలోనే టర్కీ కూడా హిజాబ్‌పై కీలక నిర్ణయం తీసుకునేందుకు అడుగులు వేస్తోంది. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డొగన్ (President Erdogan) దీనిపై ఓ రెఫరెండం తీసుకురావాలని ప్రతిపాదించారు. మహిళలకు హిజాబ్‌ ధరించే హక్కు కల్పించే విధంగా చట్టం చేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వ సంస్థల్లో, విద్యా సంస్థల్లో, యూనివర్సిటీల్లో మహిళలు హిజాబ్ ధరించే హక్కు కల్పించాలని చూస్తున్నారు. 2013లో టర్కీలో హిజాబ్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేశారు. అయితే...ఇప్పుడు దాన్ని మహిళల హక్కుగా మార్చాలని ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారు. 2023లో టర్కీలో ఎన్నికలున్నాయి. ఈ తరుణంలో...హిజాబ్‌పై చర్చ జరగటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎర్డొగన్ గెలుపోటములనూ ఈ అంశం నిర్ణయించే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష పార్టీలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు. "ధైర్యం ఉంటే ఈ విషయాన్ని రెఫరెండంలో పెడదాం రండి" అంటూ ప్రతిపక్షాలకు సవాల్ కూడా విసిరారు ఎర్డిగన్. అయితే..ప్రధాన ప్రతిపక్ష నేత కెమాల్ కిలిక్‌డరోగ్లు (Kemal Kilikdaroglu) "హిజాబ్‌ ధరించటం హక్కు అనే అంశంపై ఓ చట్టం తీసుకురావాలి" అని అంటున్నారు. 


ఎప్పటి నుంచో వాదనలు 


1990ల నుంచే టర్కీలో హిజాబ్‌పై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. కానీ...ముస్లిం దేశమైన టర్కీలో...హిజాబ్‌ను నిషేధించటానికి ఏ పార్టీ సాహసించలేదు. "గతంలో ఎన్నోతప్పులు చేశాం. ఇకపైనా అలాంటివి జరగకూడదు. ఓ నిర్ణయం తీసుకోటానికి ఇదే సరైన సమయం" అని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఇది అమలు చేసేందుకు రాజ్యాంగంలోనూ కొన్ని సవరణలు చేయాల్సి ఉంటుందని ఎర్డొగన్ ప్రతిపాదించారు. కానీ.. ఇదేమంత సులువుగా అయిపోదు. కనీసం 400 మంది మద్దతు ఉంటే తప్ప ఇది చట్టంగా మారదు. అందుకే...ఎర్డొగన్ ప్రతిపక్షాల మద్దతునీ కూడగట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. పార్లమెంట్‌లో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే...ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాం అని ఎర్డొగన్ సూచిస్తున్నారు. 


ఇరాన్‌లో బాలిక మృతి..


ఇరాన్‌లో మరోసారి అల్లర్లు ఉద్ధృతమయ్యాయి. ఇప్పటికే హిజాబ్ విషయంలో అక్కడ దాదాపు మూడు వారాలుగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ యువతి మృతితో మొదలైన అలజడి ఇంకా సద్దుమణగలేదు. ఇప్పుడు ఓ బాలిక హత్యతో మరోసారి అట్టుడుకుతోంది. అర్డాబిల్‌లోని 16 ఏళ్ల విద్యార్థిని అస్రా పనాహీని భద్రతా దళాలే కొట్టి చంపటం స్థానికంగా కలవరం రేపింది. ప్రభుత్వానికి అనుకూలంగా
పాట పాడలేదన్న కోపంతో...ఆ బాలికను క్లాస్‌రూమ్‌లోనే దారుణంగా కొట్టి చంపారు. అక్టోబర్ 13న ఇరాన్ భద్రతా దళాలు షాహెద్ గర్ల్స్‌ హైస్కూల్‌లో రెయిడ్స్ నిర్వహించాయి. ఆ సమయంలోనే ఇరాన్ సుప్రీం అయతొల్లా అలు ఖుమీనిని పొగిడే ఓ యాంథమ్‌ని పాడాలని బాలికలందరినీ హెచ్చరించాయి భద్రతా బలగాలు. అయితే...ఇందుకు వాళ్లు అంగీకరించలేదు. వెంటనే...విచక్షణా రహితంగా వాళ్లపై దాడికి దిగారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో బాలికలు గాయపడ్డారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. 


Also Read: Jio 5G: ఇకపై 4G స్మార్ట్‌ ఫోన్లు కూడా 5G సేవలు పొందవచ్చు, ఎలాగో తెలుసా?