4G ఫోన్లలో 5G సేవలను పొందే అవకాశం


భారత్ లో ఇప్పుడిప్పుడే 5G సేవలు విస్తృతం అవుతున్నాయి. తొలుత ఎంపిక చేసిన కొన్ని నగరాల్లో ఆయా టెలికాం సంస్థలు 5G సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ప్రస్తుతం రోజు రోజుకు ఇతర నగరాలకు 5G సర్వీసులను విస్తరిస్తూ పోతున్నాయి. దేశ వ్యాప్తంగా 5G నెట్ వర్క్ తో విస్తృత కవరేజీ కోసం ఇన్ ఫ్రా స్ట్రక్చర్ సెటప్ చేయడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జియో మరో ముందడుగు వేసింది. 4G ఫోన్లు సైతం 5G సేవలను పొందే అవకాశం కల్పిస్తోంది.  Wi-Fi  ద్వారా చాలా మందికి 5G సర్వీసులను అందుకునే వెసులుబాటు అందిస్తోంది. తాజాగా ఈ టెలికాం ఆపరేటర్ రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారాలో సరికొత్త 5G Wi-Fi సేవలను మొదలు పెట్టింది. కీలక ప్రాంతాల్లో Wi-Fi నెట్‌ వర్క్‌ ల ద్వారా వినియోగదారులకు 5G వేగాన్ని అందించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే విద్యా సంస్థలు, పుణ్య క్షేత్రాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, కమర్షియల్ హబ్‌లు, సహా పలు ప్రాంతాలలో Jio True 5G-ఆధారిత Wi-Fi సేవలను Jio అందిస్తోంది. వీటి ద్వారా  ప్రస్తుత 4G నెట్‌ వర్క్ సపోర్టు చేసే మోబైల్ వినియోగదారులు కూడా  5G నెట్‌వర్క్ ప్రయోజనాలను ఆస్వాదించవచ్చు.  


మరిన్ని నగరాలకు Jio 5G ఆధారిత WI-Fi సేవలు


Jio 5G ఆధారిత Wi-Fi సేవలు, Jio 5G మొబైల్ నెట్‌వర్క్ ను మరిన్ని నగరాలకు విస్తరిస్తోంది.  ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, వారణాసి వంటి ఎంపిక చేసిన నగరాల్లో ప్రారంభించిన 5G నెట్‌వర్క్ అత్యంత మెరుగ్గా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 5G సేవలను జియో దేశ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. తాజాగా ఈ జాబితాలో చెన్నై కూడా చేరింది.


ఉచితంగా అందుబాటులోకి Jio 5G Wi-Fi సేవలు


Jio 5G ఆధారిత Wi-Fi సేవలు రిలయన్స్ జియో వినియోగదారులందరికీ ఎటువంటి ఛార్జీ లేకుండా ఉచితంగా అందుబాటులో ఉంటాయి. Jio యేతర వినియోగదారులు కూడా ఈ Wi-Fi హాట్‌ స్పాట్‌ లో 5G సేవలను యాక్సెస్ చేయగలరు. కానీ, ఎక్కువ స్పీడ్ తో సేవలను అందుకోలేరు. తక్కువ కెపాసిటీ డేటాను పొందే అవకాశం ఉంది. 


అత్యంత మెరుగ్గా Jio 5G స్పీడ్


Jio 5G నెట్‌వర్క్ ప్రారంభ స్పీడ్ టెస్ట్‌లలో మంచి ఫలితాలను చూపించింది. Airtel  5G నెట్‌వర్క్‌తో పోలిస్తే, Jio యొక్క 5G నెట్‌వర్క్ సాధారణంగా 400-500 Mbps వేగాన్ని అందిస్తోంది. ఇది ప్రస్తుత 4G వేగం కంటే చాలా వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్ ను కలిగి ఉంటుంది. అంతేకాదు, Jio స్వతంత్ర 5G నెట్‌ వర్క్‌ ను ఉపయోగిస్తోంది. అంటే ఇది పూర్తిగా 5G నెట్ వర్క్ మీదే ఆధారపడి ఉంటుంది. మరింత కవరేజీని అందించడానికి బ్యాకప్‌ గా 4Gపై ఆధార పడదు. మార్చి 2024 నాటికి 5G సేవలు  దేశంలోని చాలా ప్రాంతాలకు చేరుకుంటాయని జియో ఇప్పటికే వెల్లడించింది.