దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం చోటు చేసుకుంది. శ్రీశైలం మల్లన్నను దర్శించుకునేందుకు ఆటోలో వెళ్తుండగా మార్గం మధ్యలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. నాగర్ కర్నూలు జిల్లాల్లో ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన వారిది వికారాబాద్‌ జిల్లా అని సమాచారం.
దైవ దర్శనానికి వెళ్తూ దుర్మరణం..
ఉప్పరి భీమయ్య కుటుంబం వికారాబాద్‌ జిల్లాలోని యాలాల మండలం జుంటుపల్లి గ్రామంలో నివాసం ఉంటోంది. ఆదివారం కావడంతో శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలని వారి కుటుంబసభ్యులు భావించారు. ఓ ఆటోను అద్దెకు తీసుకుని ఉప్పరి భీమయ్య తన కుటుంబసభ్యులతో కలిసి శ్రీశైలం క్షేత్రానికి బయలుదేరాడు. అయితే మార్గం మధ్యలో నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెలకపల్లి మండలంలో వీరు ప్రయాణిస్తున్న ఆటోను, టీఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ ఇద్దరిని సమీపంలోని తెలకపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరి పరిస్థితి ఆందోళనకంగా ఉన్నట్లు సమాచారం. 


కేసు నమోదు చేసిన పోలీసులు 
దైవ దర్శనానికి బయలుదేరితే ఓ కుటుంబానికి చెందిన ఇద్దరు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో జంటుపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదం ఘటపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.


జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
జగిత్యాల జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. చనిపోయినవారు ముగ్గురు మహిళలే. మరో ఇద్దరు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వెల్గటూర్ మండలం కిషన్‌రావుపేట సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులను ధర్మపురి మండలం కమలాపూర్‌కు చెందినవారిగా గుర్తించారు.


కారు కరీంనగర్ నుంచి వెల్గటూరు వైపు వెళ్తోంది. అదే సమయంలో ఓ ఆటో ధర్మపురి నుంచి ధర్మారం వైపు వెళ్తుండగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు మృతిచెందారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారికి చికిత్స అందించేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.