తెలుగు తెరపై హోమ్లీ పాత్రల్లో కనిపించి మెప్పించిన ముద్దుగుమ్మ పూర్ణ. అందం, అభినయం ఉన్నా ఈమెకు అనుకున్న స్థాయిలో తెలుగులో గుర్తింపు రాలేదు. 2007లో ‘శ్రీ మహాలక్ష్మి’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఈ మూవీ పెద్దగా హిట్ కాలేదు. అనంతరం సీమ టపాకాయ్, అవును, అవును-2, లడ్డూబాబు, రాజుగారిగది, జయమ్ము నిశ్చయమ్మురా  సహా పలు సినిమాల్లో నటించింది. వీటిలోనూ ఓ రేంజిలో గుర్తింపు తెచ్చిన సినిమాలు లేవనే చెప్పుకోవచ్చు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలో చాలా సినిమాలు చేసింది. మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ కొనసాగిస్తున్నది. అటు పలు టీవీ షోలలో జడ్జిగా వ్యవహరిస్తోంది.


సోషల్ మీడియాలో బోలెడు పుకార్లు


కొంత కాలం క్రితం కొంత మంది వ్యక్తులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి ప్రేమ పేరుతో ఈమెను మోసం చేశారనే వార్తలు వచ్చాయి. తన నుంచి పెద్ద మొత్తంలో డబ్బు, నగలు దోచుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. అప్పట్లో ఈ వార్తలు సినిమా పరిశ్రమలో పెద్ద సంచలనం కలిగించాయి. ఆ తర్వాత ప్రేమ అంటేనే తనకు నమ్మకం పోయిందని పలుమార్లు ఈమె వెల్లడించింది. ఇటీవలే పూర్ణ తనకు కాబోయే భర్త గురించి వెల్లడించింది. ఎంగేజ్మెంట్ ఫొటోలను కూడా పోస్ట్ చేసింది. అయితే, పెళ్లయిన విషయాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె తనకు పెళ్లయిపోయినట్లు చెప్పినట్లు తెలిసింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


దుబాయ్ లో పెళ్లి, కేరళలో రిసెప్షన్


తాజాగా తన పెళ్లి గురించి షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఇప్పటికే తన పెళ్లి అయ్యిందని వెల్లడించింది. అరబ్ కంట్రీకి చెందిన ఆసీఫ్ అలీతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నట్లు చెప్పింది.  తమ ఎంగేజ్మెంట్ ఈ ఏడాది మేలో జరిగిందని, జూన్ లో దుబాయ్ వేదికగా తమ పెళ్లి అయ్యిందని తెలిపింది.  అయితే, వీసాల జారీ కారణంగా తమ పెళ్లి చాలా మంది రాలేకపోయారని చెప్పింది. కేవలం తమ కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి జరిగినట్లు వివరించింది. త్వరలో కేరళలో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు పూర్ణ వెల్లడించినట్లు తెలిసింది. తర్వలో దుబాయ్ లో ఓ డ్యాన్స్ స్కూల్ పెట్టబోతున్నట్లు చెప్పింది. ఈ నేపథ్యంలో పూర్ణ బుల్లి తెరకు కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, పెళ్లి తంతు ఇంకా మిగిలి ఉండటం వల్లే పూర్ణ అధికారికంగా ప్రకటించలేనట్లు తెలుస్తోంది. కేరళలో జరిగే కార్యక్రమం తర్వాత ఈ విషయాన్ని పూర్ణ సోషల్ మీడియాలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం నాని హీరోగా చేస్తున్న ‘దసరా’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనుంది. ఇతర భాషల్లోనూ కొన్ని సినిమాల్లో పూర్ణ నటిస్తోంది.