ఆపిల్ వాచ్ అధునాతన టెక్నాలజీతో పనిచేస్తుందని తెలిసిన విషయమే. ఇది గుండె స్పందన రేటును చెప్పే ఫీచర్‌తో పనిచేస్తుంది. అందుకే చాలా మంది ఈ వాచ్‌ను ధరించేందుకు ఇష్టపడతారు. అమెరికాలో ఆపిల్ వాచ్‌లు చిన్న పిల్లలు కూడా ఉపయోగిస్తారు. అలా పన్నెండేళ్ల అమ్మాయికి నిత్యం ఆ వాచీని పెట్టుకునే అలవాటు ఉంది. అదే ఆమె ప్రాణాన్ని కాపాడింది. ప్రాణాంతక క్యాన్సర్‌ను ముందే గుర్తించి చికిత్స తీసుకునేలా చేసింది. ఫలితంగా ఆమెకు ప్రాణాపాయ స్థితి తప్పింది.


ఇమాని మైల్స్ అనే పన్నేండేళ్ల అమ్మాయి చేతికి నిత్యం ఆపిల్ వాచీ ఉంటుంది. దాన్ని ఆమె కేవలం ఒక గాడ్జెట్‌గానే చూసింది. అయితే ఆ వాచ్ కొన్ని రోజుల క్రితం బీప్ శబ్ధాన్ని ఇవ్వడం మొదలుపెట్టింది. చేతికి పెట్టుకున్నప్పుడు ఈ శబ్ధాన్ని ఇచ్చేది. తీసేస్తే మాత్రం ఎలాంటి సౌండ్ వచ్చేది కాదు. బాలిక తల్లి జెస్సికా ఈ విషయాన్ని గమనించింది. హార్ట్ బీట్‌లో తేడా వచ్చినప్పుడు ఆ బీప్ శబ్ధం వస్తుంది. అది అసాధారణంగా వచ్చే అధిక  హృదయ స్పందన రేటు గురించి ఇలా హెచ్చరిస్తూ ఉంటుంది. తల్లి అలాగే అనుకుంది. చిన్న పిల్లకు గుండె కొట్టుకునే వేగం ఎందుకలా పెరిగిందో అర్థం కాలేదు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లింది తల్లి. 


గుండె జబ్బు కాదు, క్యాన్సర్
గుండెలో సమస్యేమో అనుకుంది తల్లి జెస్సికా, కానీ గుండె బాగానే ఉందని చెప్పారు వైద్యులు. ఎందుకిలా వాచ్ బీప్ శబ్ధాన్ని చేసిందో తెలుసుకోవడం కోసం శరీరాన్ని స్కాన్ చేశారు వైద్యులు. అందులో పొట్ట దగ్గర ఉండే అసెండిక్స్ అనే భాగంలో క్యాన్సర్ కణితిని గుర్తించారు వైద్యులు. అది ‘న్యూరోఎండోక్రైన్ ట్యూమర్’ అని గుర్తించారు. ఇది పిల్లల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. ఆ క్యాన్సర్ మిగతా అవయవాలపై కూడా ప్రభావం చూపిస్తున్నట్టు గుర్తించారు. అప్పుడప్పుడు గుండె కొట్టుకునే వేగం దీనివల్లే పెరుగుతోంది. దీంతో ఆపిల్ వాచ్ బీప్ శబ్ధాన్ని ఇచ్చింది. ఆ వాచీయే లేకుంటే క్యాన్సర్‌ను ముందుస్తుగా కనిపెట్టలేకపోయేవారు వైద్యులు. దీంతో బాలిక తల్లి ఆపిల్ వాచ్ లేకుంటే ఏమై ఉండేదో అంటూ చెప్పింది. 


ఏమిటి పరిస్థితి?
కణితిని గుర్తించిన వైద్యులు దాన్ని తొలగించడానికి శస్త్రచికిత్స చేయాలని చెప్పారు. దీంతో ఇమానీ ఆసుపత్రిలో చేరింది. ఆమెకు ఆపరేషన్ చేసి క్యాన్సర్ కణితిని తొలగిస్తారు. చికిత్స కొన్ని నెలల పాటూ సాగుతుంది. ఏదేమైనా ఇమానీ ప్రాణాలను కాపాడింది ఆపిల్ వాచ్ అనే చెప్పుకోవాలి. చివరి స్టేజీ వరకు ఆ క్యాన్సర్ బయటపడకపోతే ప్రాణాలను రక్షించడం కష్టంగా మారేది. 


గర్భాన్ని కూడా...
ఆపిల్ వాచ్ గతంలో కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. 34 ఏళ్ల మహిళ గర్భాన్ని అది గుర్తించి బీప్ శబ్ధాన్ని ఇచ్చింది. శరీరంలో ఏదో మార్పు వచ్చిందని అందుకే వాచ్ బీప్ సౌండ్ ఇస్తోందని అనుకుని ఆసుపత్రికి వెళ్లింది ఆ మహిళ. తీరా చూస్తే ఆమె గర్భం ధరించినట్టు చెప్పారు వైద్యులు. అలాగే మరో మహిళ గుండెలో ఉన్న సమస్యను కూడా గుర్తించి ఆపిల్ వాచ్. ఆమె గుండెలో ఉన్న చిన్న సమస్య కారణంగా కొట్టుకునే వేగం మారింది. దీంతో వాచీ సౌండ్ చేస్తూనే ఉంది. ఆసుపత్రికి వెళితే గుండెలో అరుదైన కణితి బయటపడింది. ఇప్పుడు అమెరికాలో ఆపిల్ వాచీకి ఎంతో మంది అభిమానులు. టైమ్ కోసం కాకుండా ఆరోగ్యం కోసం ఆ వాచీని ధరించే వాళ్ల సంఖ్య పెరిగిపోయింది. 


Also read: ఆస్తమా ఉన్న పిల్లలను దీపావళి కాలుష్యం నుంచి ఎలా కాపాడుకోవాలి?