Satyavathi Rathod: మునుగోడు ఉప ఎన్నికల కోసం మంత్రి సత్యవతి రాథోడ్ శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా రాధానగర్ తండాలో పాదరక్షలు లేకుండానే ప్రచారం చేయడం కనిపించింది. ఇదే విషయమై ఆమెను అడగా... సీఎం కేసీఆర్ గిరిజన సంక్షేమం కోసం కృషి చేస్తున్న వ్యక్తి అని తెలిపారు. 6 శాతం ఉన్న రిజర్వేషన్లను 10 శాతానికి పెంచారని గుర్తు చేశారు. గిరిజనబంధు ప్రవేశ పెట్టారని తెలిపారు. ఊహించని విధంగా తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేశారన్నారు. మరోసారి ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు వివరించారు. అప్పటి వరకు పాదరక్షలు వేసుకోనని సెప్టెంబర్ 17 నుంచి దీక్ష ప్రారంభించానని తెలిపారు. 


చివరి రక్తం బొట్టు వరకు కేసీఆర్ వెంటే..


గిరిజన జాతి మొత్తం సీఎం కేసీఆర్ కి రుణపడి ఉంటుందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆయన చేసిన సేవల గురించి గుర్తు చేసుకుంటూ ఆమె భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. సంపన్నులుండే బంజారాహిల్స్ లో బంజారా, ఆదివాసి భవన్ లను నిర్మించిన నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు.  ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలతో పాటు గిరిజనులను కడుపున పెట్టుకొని చూసుకుంటున్నారన్నారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు, పోడు భూములకు పట్టాలు, గిరిజన బంధు లాంటి పథకాలు తీసుకువస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఒక గిరిజన బిడ్డకు ఇచ్చిన గౌరవాన్ని తలుచుకొని ముఖ్యమంత్రికి శిరస్సు వంచి ధన్యవాదాలు చెబుతున్నానని మంత్రి అన్నారు.


శిరస్సు వంచి పాదాభివందనం..


మహబూబాబాద్ జిల్లా గడ్డపై పుట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉందని మంత్రి అన్నారు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టిన తనకు ఎమ్మెల్సీగా గుర్తింపు ఇచ్చి, మంత్రిగా చేసి ఉన్నతమైన స్థానాన్ని కల్పించారన్నారు. తన జీవితంలో ఊహించని విధంగా ఆదరించినందుకు తెలంగాణలో తనకు ప్రత్యేకమైన స్థానం ఇచ్చారని భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు.  ఇంతటి మహోత్తరమైన కార్యక్రమాలలో తన భాగస్వామ్యం ఉండడం, ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి శిరస్సు వంచి పాదాభివందనం తెలుపుతూ, తన చివరి రక్తం బొట్టు వరకు కేసీఆర్  వెంటే ఉంటానని స్పష్టంచేశారు. 


బీజేపీ, కాంగ్రెస్ కు నూకల చెల్లాయ్..


బీజేపీ మాయమాటలు చెప్తే తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. సీఎ కేసీఆర్ రిజర్వేషన్లు ప్రకటించినప్పటి నుంచి బీజేపీకి వణుకు పుడుతుందని తెలిపారు. తెలంగాణ గడ్డపై ప్రజల మధ్య మతవిద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీకి, దేశంలో ఎక్కువ కాలం పాలించి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లాయని ఆరోపించారు. రిజర్వేషన్ల పెంపు జీవోకు ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తే బండి సంజయ్ పై గిరిజనులు తిరగబడతారన్నారు.  ముందే రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వలేదని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అనడం సిగ్గుచేటు అన్నారు. ఇన్నేళ్లు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి ఏంచేశారని ప్రశ్నించారు. సిగ్గు ఉంటే తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చింది ఏముందో చెప్పి ప్రజల్లో తిరగాలని సవాల్ చేశారు. ఎంపీ సోయం బాబూరావు గిరిజన రిజర్వేషన్లపై ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారని, కాస్త ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు.  గిరిజనులు, ఆదివాసి బిడ్డల మధ్య రాజకీయ లబ్ధి కోసం, చిచ్చు పెట్టి  చౌకబారు ప్రకటన చేస్తే గిరిజన సోదరులు ఊరుకోరన్నారు. కేంద్ర ప్రభుత్వం విభజన చట్ట హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని విమర్శించారు.