IND vs PAK Weather Report: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో అత్యంత ఆసక్తికరమైన మ్యాచుకు వేళైంది! ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మైదానం మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ తలపడుతున్నాయి. మధ్యాహ్నం 1:30 గంటలకు ఆట మొదలవుతుంది. ప్రత్యక్షంగా లక్ష మందికి పైగా ఈ పోరును వీక్షించే అవకాశం ఉంది.
ఆటతో పాటు అభిమానులు మరో విషయాన్నీ ఉత్కంఠంగా ట్రాక్ చేస్తున్నారు! అదే వరుణుడి గమనం! లానినా కారణంగా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో వర్షాలు పడుతున్నాయి. భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ ఇందువల్లే రద్దైంది! మెల్‌బోర్న్‌లోనూ గత రెండు రోజులుగా వానలు పడుతున్నాయి. ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్నాయి. ఆదివారం వరుణుడు ఏం చేస్తాడోనని ఫ్యాన్స్ భయపడుతున్నారు!
తాజా సమాచారం ఏంటంటే మెల్‌బోర్న్‌లో ఆదివారం వర్షం కురిసే అవకాశం తక్కువే! మూడు రోజుల క్రితం 95 శాతం వరకు వర్షం పడుతుందన్న అంచనాలు ఉండగా ఇప్పుడు 25 శాతానికి తగ్గిపోయాయి. ఆకాశం మాత్రం మేఘావృతమై ఉంటుందని, తీవ్రంగా గాలులు వీస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల నుంచి వర్షం కురిసేందుకు 5 శాతమే అవకాశం ఉందని పేర్కొంది.
టీమ్‌ఇండియా, పాకిస్థాన్ జట్లు శనివారం కఠోరంగా సాధన చేశాయి. వీరి నెట్ ప్రాక్టీస్‌ను వీక్షించేందుకు వేల సంఖ్యలో అభిమానులు మెల్‌బోర్న్ మైదానానికి వచ్చారు. దాంతో అక్కడ సందడి నెలకొంది. వాతావరణం ఎలాగున్నా ఆడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కెప్టెన్ రోహిత్ శర్మ అంటున్నాడు. 'కొన్ని రోజులుగా మెల్‌బోర్న్ వాతావరణం గురించి వింటున్నాను. అప్పటికీ ఇప్పటికీ మెరుగుదల కనిపిస్తోంది. ఉదయం నిద్రలేచి హోటల్ గది తెరలు పక్కకు తొలగించగానే చాలా భవంతులు మబ్బుల మధ్యే కనిపించాయి. ఇప్పుడు సూర్యుడు కనిపిస్తున్నాడు. ఆదివారం ఏం జరుగుతుందో తెలియదు. మా చేతుల్లో ఉన్నవాటినే మేం నియంత్రిస్తాం. శనివారం బాగా ప్రాక్టీస్ చేశాం. పూర్తి ఓవర్ల మ్యాచ్ జరుగుతందనే ఆశిస్తున్నా' అని వెల్లడించాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ సైతం ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశాడు.