Hyderabad Rains : హైదరాబాద్ ను వరుణుడు వదలడంలేదు. శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణ మారిపోయింది. నగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ మళ్లీ జలమయం అయ్యాయి. మూసీనది వరద ఉద్ధృతి కాస్త తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న నగర వాసులు మళ్లీ భారీ వర్షం కురుస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. ఉదయం ఎండ కాయడంతో పనుల మీద బయటకు వెళ్లిన వారు తడిసి ముద్దయ్యారు. రోడ్లపై నీరు చేయడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.  






మౌలాలి 124 మి.మీ వర్షం 


మౌలాలిలో కేవలం 1 గంటలోనే 124 మిమీ వర్షపాతం నమోదు అయింది. ఉప్పల్, ఎల్బీనగర్, మల్కాజ్‌గిరి, కాప్రా, సరూర్‌నగర్, అల్వాల్ లో గంట పాటు భారీ వర్షం కురిసింది. మియాపూర్‌, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్, ప్రగతి నగర్‌, బాచుపల్లి, జీడిమెట్ల, బాలానగర్‌, అపురూపకాలనీ, కుత్బుల్లాపూర్‌, గాజులరామారం, సూరారం, అమీర్‌పేట, ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. రహదారులపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డుతున్నారు. 


మూసారంబాగ్ వంతెనపై మళ్లీ నీళ్లు 


ఇటీవల కురిసిన భారీ వర్షానికి మూసీనదిపై ఉన్న మూసారంబాగ్‌ వంతెన పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో రెండు రోజుల పాటు రాకపోకలు నిలిపివేశారు. మళ్లీ ఇవాళ  భారీ వర్షం కురవడంతో వంతెనపై నీరు నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు మళ్లీ అంతరాయం ఏర్పడింది. కాచిగూడ ట్రాఫిక్‌ పోలీసులు బ్రిడ్జిపై నిలిచిన నీటిని తొలగించి ట్రాఫిక్‌ పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు.  


తెలంగాణలో భారీ వర్షాలు 


తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువులు, వాగులు , వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి.  మూసీనది వరద పోటెత్తడంతో పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. నదిని పరివాహక కాలనీలలోని ఇళ్లలోని నీరు ప్రవేశించింది. హైదరాబాద్ మహా నగరాన్ని వర్షం వీడడంలేదు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి నగరాన్ని మళ్లీ మబ్బులు కమ్మేశాయి. చాలా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నేరేడ్‌మెట్‌లో 7.3 సెంటీమీటర్లు, మల్కాజ్‌గిరిలో 5.1 మి.మీ, బాల్‌నగర్‌లో 5 మి.మీ, అల్వాల్‌లో 4.8 మి.మీ వర్షపాతం నమోదైంది. మరో గంట పాటు హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో మరో రెండు గంటల పాటు వర్షం కురుస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. 






ట్రాఫిక్ జామ్ 


హైదరాబాద్ లో భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ వెస్ట్ జోన్ ప్రాంతాలైన పంజాగుట్టు, బేగంపేట్, బంజారాహిల్స్, జుబ్లీహిల్స్, ఎస్ఆర్ నగర్ లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఈ మార్గాల్లో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మార్గాల్లో వచ్చే వాహనదారులు ఒక గంట పాటు తమ ప్రయాణాలను పోస్ట్ పోన్ చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.