మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఈ సినిమాతో నిర్మాతలు బాగా నష్టపోయారు. దీంతో తన తదుపరి సినిమాతో పెద్ద హిట్ అందుకోవాలని చూస్తున్నారు మెగాస్టార్. ప్రస్తుతం ఆయన మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్' అనే సినిమాలో నటిస్తున్నారు. మలయాళ 'లూసిఫర్'కి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు.


ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ క్యామియో రోల్ పోషిస్తున్నారు. చిరంజీవికి బాడీగార్డ్ లా కనిపించే రోల్ ఇది. కానీ సినిమా మొత్తం సల్మాన్ కనిపించరు. ఒక యాక్షన్ సీన్ లో ఆయన క్యారెక్టర్ ని హైలైట్ చేసి చూపించబోతున్నారు. అలానే చిరు, సల్మాన్ ల కాంబినేషన్ లో ఓ పాట కూడా ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించిన షూటింగ్ ముంబైలో జరుగుతోంది. 


చిరంజీవి, సల్మాన్ ఖాన్ ల మధ్య వచ్చే ఈ సాంగ్ ను ప్రభుదేవా కొరియోగ్రఫీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేసిన చిరంజీవి.. ఫ్యాన్స్ కి ఈ సాంగ్ ఐఫీస్ట్ అవుతుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.