Strange Thing: జన్యు ఉత్పరివర్తనం (జెనెటిక్ మ్యూటేషన్).. పిండం ఏర్పడే సమయంలో హార్మోన్ల ప్రభావంతో ఆడ లేదా మగ అనేది నిర్ణయం అయిపోతుంది. పుట్టబోయే బిడ్డ ఆడనా లేదా మగనా అనేది తేలిపోతుంది. చాలా మందిలో సాధారణంగా జరిగే ప్రక్రియ ఇదే. అయితే జన్యు ఉత్పరివర్తనం వల్ల కొన్ని సార్లు అరుదైన ఘటనలు చోటుచేసుకుంటాయి. అలాంటి ఓ అరుదైన ఘటన హైదరాబాద్ లో జరిగింది. ఓ వ్యక్తిలో పురుష, స్త్రీ జననాంగాలు రెండూ ఉన్నట్లు తాజాగా హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలోని వైద్యులు గుర్తించారు. 


మంచిర్యాలకు చెందిన ఓ వ్యక్తికి వృషణాలు లేవు. ఆ వ్యక్తి 40 ఏళ్లుగా అలాగే ఉంటున్నాడు. పెళ్లి చేసుకున్నాడు, కానీ ఎంతకీ పిల్లలు పుట్టడంలేదు. గుళ్లూ, గోపురాలు తిరిగినా ఫలితం లేదు. అయితే కొన్ని రోజుల నుంచి పొత్తి కడుపు కింద విపరీతమైన నొప్పి వేధించడం మొదలు పెట్టింది. దీంతో సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు ఆ వ్యక్తికి అల్ట్రాసౌండ్, స్కానింగ్, ఎంఆర్ఐ వంటి పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో ఆ వ్యక్తిలో పురుష, స్త్రీ జననాంగాలు రెండూ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. జెనెటిక్ మ్యూటేషన్ (జన్యు ఉత్పరివర్తనం) కారణంగా ఈ పరిస్థితి తలెత్తినట్లు వైద్యులు తేల్చారు. సాధారణంగా పిండం ఏర్పడిన సమయంలోనే హార్మోన్ల ప్రభావంతో ఆడ, మగ అనేది నిర్ణయం అయిపోతుంది. అయితే మంచిర్యాల వ్యక్తి విషయంలో మాత్రం జన్యు ఉత్పరివర్తనం కారణంగా.. హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి ఆడ, మగ రెండు రకాల జననాంగాలు ఏర్పడ్డాయి. 


అందులో గర్బ సంచి, ఫాలోపియన్ ట్యూబ్స్ తో పాటు వృషణాలు ఉదర భాగంలోననే ఉండిపోయాయి. ఇలాంటి వారు అన్ని అంశాల్లో మామూలుగానే ఉంటారు. హార్మోన్లు, పురుషాంగం, మీసాలు, గడ్డాలు అన్ని సాధారణంగానే ఉంటాయి. అయితే వృషణాలు మాత్రం శరీరం లోపలే ఉండిపోతాయి. ఆ వృషణాలు వీర్య కణాలను ఉత్పత్పి చేయలేవు. దాని వల్ల పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. 


మంచిర్యాల వ్యక్తికి ఆండ్రాలజిస్టు, రోబోటిక్ సర్జన్ వైఎం ప్రశాంత్ శస్త్ర చికిత్స చేశారు. చిన్నపాటి కోతతో కూడిన ల్యాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స చేసి.. గర్భసంచి, ఫాలోపియన్ ట్యూబ్స్ తో పాటు వృషణాలను కూడా తొలగించారు. సాధారణంగా 18 ఏళ్లు వయస్సు దాటిన తర్వాత కూడా వృషణాలు లోపలే ఉండిపోతే క్యాన్సర్ గా మారే ప్రమాదం ఉంటుందని.. అందువల్ల వాటిని కూడా తొలగించాల్సి వచ్చిందని ఆండ్రాలజిస్టు, రోబోటిక్ సర్జన్ వెల్లడించారు. ఇన్ని సంవత్సరాలుగా ఆ వ్యక్తి పడుతున్న ఇబ్బందులు ఈ సర్జరీతో తొలగిపోయాయని వైద్యులు తెలిపారు. అయితే పిల్లలు పుట్టే అవకాశం మాత్రం లేదన్నారు. 18 సంవత్సరాల వయసుకు ఈ సమస్యను గుర్తించి సర్జరీ చేసి వృషణాలను బయటకు తెచ్చి ఉంటే.. సాధారణంగానే జీవించే అవకాశం ఉండేదని తెలిపారు. కానీ పేదరికం, నిరక్షరాస్యత కారణంగా ఇన్నేళ్లుగా సమస్యను గుర్తించలేకపోయారని వివరించారు. ఇలాంటి కేసులు చాలా  అరుదు అని.. ప్రపంచంలో ఇప్పటి వరకు 300 కేసులు మాత్రమే నమోదు అయ్యాయని, భారత్ లో అయితే ఇలాంటి కేసులు ఇప్పటి వరకు కేవలం 20 మాత్రమే బయటికి వచ్చాయని తెలిపారు.