ప్రతీ శనివారం కొత్త కొత్త సెలబ్రిటీలతో అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది ‘సుమ అడ్డా’. ఇక ఈ శనివారం మెగా హీరో వరుణ్ తేజ్‌ను తన షోకు తీసుకొచ్చింది. వరుణ్ తేజ్ తరువాతి సినిమా ‘గాండీవధారి అర్జున’ ప్రమోషన్స్ కోసం తనతో పాటు దర్శకుడు ప్రవీణ్ సత్తారు, హీరోయిన్ సాక్షి వైద్య కూడా పాల్గొన్నారు. ఇటీవల ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. హీరోగా ఎంతోమంది అమ్మాయిలకు క్రష్ అయిన వరుణ్ తేజ్.. ‘సుమ అడ్డా’ షోకు అమ్మాయిల ద్వారానే స్వీట్‌గా వెల్‌కమ్ అందుకున్నాడు. అయితే ఆ అమ్మాయిలు ఎవరు కనీసం వరుణ్ తేజ్ హైట్‌కు మ్యాచ్ అవ్వలేదు అని సుమ అనడంతో.. అందరూ నిజమే అంటూ నవ్వుకున్నారు.


‘గబ్బర్‌సింగ్’ స్ఫూఫ్..
‘సుమ అడ్డా’కు వచ్చిన ప్రతీ ఒక్క సెలబ్రిటీతో ఏదో ఒక ఫేమస్ సినిమా స్ఫూఫ్ చేస్తారు. అలాగే వరుణ్ తేజ్‌తో కూడా తన బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘గబ్బర్‌సింగ్’ సినిమా స్ఫూఫ్‌ను చేయించింది. ‘గబ్బర్‌సింగ్‌’లోని ఫేమస్ కామెడీ సీన్‌ అంత్యాక్షరిని అక్కడి స్టూడెంట్స్‌తో వరుణ్ రీక్రియేట్ చేశాడు. నాక్కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది అనే ఫేమస్ డైలాగుతో ఈ స్ఫూఫ్‌ను ప్రారంభించాడు. ఒక అబ్బాయి వేసిన వీణ స్టెప్‌ను కామెంట్ చేస్తూ కామెడీను క్రియేట్ చేశాడు వరుణ్. సుమ కూడా ఆ అబ్బాయి డ్యాన్స్‌ను కామెంట్ చేయడంతో దర్శకుడు ప్రవీణ్ సత్తారు.. ఆ స్టెప్‌ను మీరు చేసి చూపించండి అని అన్నాడు. దీంతో సుమ షో నుండి వెళ్లిపోతానంటూ కామెడీ చేసింది. 


‘నవ్వింది మల్లెచెండు’కు రెచ్చిపోయి డ్యాన్స్..
సాక్షి వైద్య తెలుగమ్మాయి కాదు. కాబట్టి మీ అత్తారిల్లు ఎక్కడ అయితే బాగుంటుంది అంటూ సుమ ప్రశ్నించింది. దానికి సమాధానంగా సాక్షి.. తనకు హైదరాబాద్ అంటే ఇష్టమని చెప్పింది. ఎక్కడెక్కడి నుండో వస్తూ ఇక్కడ కోడళ్లు అయిపోతున్నారు అంటూ లావణ్య త్రిపాఠిని ఉద్దేశించి కామెంట్ చేసింది సుమ. హైదరాబాద్ అబ్బాయిలు మంచోళ్లు కాబట్టి అలా అవుతున్నారు అంటూ వరుణ్ తేజ్ కౌంటర్ ఇచ్చాడు. ఆ తర్వాత వరుణ్ తేజ్, సాక్షి, సుమ కలిసి ఒక ఫన్నీ స్కిట్‌తో అలరించారు. ఆపై చిరంజీవి ఎవర్‌గ్రీన్ క్లాసిక్ పాటల్లో ఒకటైన ‘నవ్వింది మల్లెచెండు’ అనే పాటకు సుమ రెచ్చిపోయి డ్యాన్స్ చేసి అందరినీ నవ్వించింది. 


‘లావ్’ అని సేవ్ చేసింది..
వరుణ్ తేజ్ చిన్నప్పటి ఫోటోలను చూపించి.. ఆ ఫోటో వెనుక ఉన్న కథను అడిగి తెలుసుకుంది సుమ. చిన్నప్పుడు రామ్ చరణ్.. వరుణ్ తేజ్‌ను ఎత్తుకున్న ఫోటోను చూపించగా.. ఇప్పుడు నేను చరణ్‌ను ఎత్తుకోవాలి అంటూ సరదాగా అన్నాడు వరుణ్. ఆ తర్వాత మెగా కజిన్స్ అంతా చిన్నప్పుడు కలిసి పడుకున్న ఫోటోను చూపించారు. ఆపై వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్ ఫోటోలు వచ్చాయి. అదే సమయంలో వరుణ్ ఫోన్‌లో లావణ్య కాంటాక్ట్ ఏమని ఉంటుంది అని ఒక స్టూడెంట్ ప్రశ్నించింది. దానికి ‘లావ్’ అంటూ సమాధానమిచ్చాడు ఈ హీరో. అయితే రిలేషన్‌షిప్ మొదలయ్యాక అలా జరిగిందా లేక ముందు నుండి అంతేనా అని సుమకు అనుమానం వచ్చింది. లావణ్యనే తన ఫోన్ తీసుకొని కాంటాక్ట్ మార్చిందని వరుణ్ క్లారిటీ ఇచ్చాడు. చాలా సంవత్సరాలు అయిపోవడంతో లావణ్యకు తను ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ గుర్తులేదన్నాడు వరుణ్. ఆపై వరుణ్, లావణ్య ఎంగేజ్‌మెంట్ తర్వాత వచ్చిన కొన్ని మీమ్స్ చూసుకొని అందరూ నవ్వుకున్నారు.



Also Read: అవును, పవన్ కళ్యాణ్ సినిమాలో - కన్ఫర్మ్ చేసిన హీరోయిన్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial