Hyderabad News: తెలంగాణలో మరోసారి ఎన్‌ఫోర్స్ మెంట్ దాడులు సంచలనం సృష్టించాయి. తాజాగా కామినేని ఆస్పత్రి ఛైర్మన్ సూర్యనారాయణ, ఎండీ శ‌్రీధర్ నివాసాలపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. కేవలం ఇళ్లలోనే కాకుండా కార్యాలయాల్లో కూడా తనిఖీలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో కూడా ఈడి అధికారుల సోదాలు చేస్తున్నారు. ఉదయం నుంచి ఈ తనిఖీలు సాగుతున్నాయి. ప్రతి ఫైలును క్షుణ్ణంగా పరిశీలిస్తూ.. మెడికల్ కళాశాలతోపాటు యాజమాన్యం ఆస్తులపై ఆరా తీస్తున్నారు. షామీర్ పేటలోని మెడిసిటీ కళాశాల ఏరియాలో అధికారులు దాడులు చేస్తున్నారు. ఫిల్మ్ నగర్ లోని ప్రతిమా కార్పొరేట్ కార్యాలయంపై ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తం రెండు టీంలుగా విడిపోయి మరీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 


రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15 చోట్ల ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. బషీర్ బాగ్ లోని ఈడీ ఆఫీసు నుంచి 11 బృందాలుగా ఈడీ అధికారులు బుధవారం ఉదయం బయలుదేరారు. ఈడీ బృందాలతోపాటు సీఆర్పీఎఫ్ బలగాలు కూడా వారి వెంట ఉన్నాయి. భాగ్యనగరంతో పాటు నల్లొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, మేడ్చల్ జిల్లాల్లో ఈడీ రైడ్స్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కార్ఖానా, చౌటుప్పల్, జడ్చర్ల, పీవీ ఎక్స్ ప్రెస్ వే, గచ్చిబౌలి, ఓఆర్ఆర్, శామీర్ పేట వైపు ఈడీ బృందాలు వెళ్లాయి.