Minister Talasani : హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణదారులపై ఫిర్యాదులు చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. వారు ఇచ్చే ఫిర్యాదులను ప్రోత్సహించకండని సూచించారు. హైదరాబాద్ గోషామహల్ లో పర్యటించిన మంత్రి తలసాని ఇటీవల కుంగిన నాలాను అధికారులతో కలిసి పరిశీలించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ సమక్షంలో టౌన్ ప్లానింగ్ అధికారులపై మంత్రి తలసాని ఫైర్ అయ్యారు. పనుల్లో నిర్లక్ష్యం వద్దని సూచించారు. అలాగే ఎవరైనా అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులైనా, ఇంకెవరైనా భవన నిర్మాణదారులపై బెదిరింపులకు పాల్పడే వారిని జైలులో వేయిస్తామన్నారు. అధికారులు ఇలాంటి వారితో సన్నిహితంగా మెలిగితే వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. 


వ్యాపారాల కన్న ప్రజల ప్రాణాలు ముఖ్యం 


"గోశామహల్ చాక్నవాడి నాలా పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. నాలా పనులకు రూ.1 కోటి 27 లక్షల నిధులు కేటాయించాం. ఈ ప్రాంతంలో హేవీ లోడ్ తో వెహికిల్స్ తిరగడం వల్ల నాలా రోడ్డు కుంగిపోయింది. ఈ రోడ్డులో హేవీ వెహికిల్స్ తిరగకుండా కమాన్ ను ఏర్పాటు చేస్తాం. నాలాను ఆక్రమించుకొని చేపట్టిన నిర్మాణాలను గుర్తిస్తున్నాం. వారికి నోటీసులు ఇచ్చి నిర్మాణాలను తొలగిస్తాం. వ్యాపారం కన్నా ప్రజల ప్రాణాలు ముఖ్యం. భవన నిర్మాణదారులను బ్లాక్ మెయిల్ చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం."-మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 



ఆక్రమణలు తొలగిస్తాం 


 "చాక్నావాడిలో నాలాను పునరుద్ధరిస్తాం. 1970లో వరదల సమయంలో ఈ నాలాపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నాలాపై అక్రమనిర్మాణాలు గుర్తించాం. ఎన్ఏసీపీ అధికారులు ఈ నాలాను స్టడీ చేశారు. ఈ నాలా స్టడీ చేసి ఎక్కడెక్కడ పునరుద్ధరణ చేయాలో వాళ్లు చెప్పారు. నెలన్నరలోపు చాక్నావాడి నాలా పనులు పూర్తిచేస్తాం. హేవీ వెహికల్ రాకుండా కమాన్ ఏర్పాటు చేస్తాం. నాలాపై ఎక్కడెక్కడ ఆక్రమణలు ఉన్నాయో వాటిని గుర్తించి తొలిగిస్తాం. దీనికి స్థానికులు, ప్రతిపక్షాలు కూడా సహకరించాలి" - మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్






చాక్నావాడిలో కుంగిన నాలా


హైదరాబాద్ గోశామహల్ లోని చాక్నావాడిలో ఇటీవల నాలా కుంగిపోయింది. నాలాపై ఉన్న కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. బస్తీలో ఏర్పాటు చేసిన కూరగాయల దుకాణాలు నాలాలో పడిపోయాయి. మార్కెట్లో ఏర్పాటుచేసుకున్న కూరగాయల దుకాణాలతో సహా పలువురు నాలాలో పడిపోయి గాయపడ్డారు. ఒక్కసారిగా నాలా కుంగిపోవడంతో స్థానికులు ఆందోళనకు గురైరయ్యారు.