Post Office Interest Rates Hike: పోస్టాఫీస్‌ పథకాలకు డబ్బు కడుతున్నారా? మీకో గుడ్‌న్యూస్‌, ఈ ఒక్కరోజు ఆగండి చాలు

చిన్న మొత్తాల పొదుపు పథకాల మీద వడ్డీ రేట్లను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేయవచ్చు.

Continues below advertisement

Post Office Interest Rates Hike: మీరు చిన్న మొత్తాల పెట్టుబడిదారా..?, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), జాతీయ పొదుపు పత్రం ‍‌(NSC) సహా పోస్‌ ఆఫీస్‌ చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడి పెడితున్నారా..? అయితే, మీరు ఒక మంచి వార్తను వినబోతున్నారు. మీరు కష్టపడి కూడబెడుతున్న డబ్బు లేదా పెట్టుబడి మీద మంచి రాబడి పొందే అవకాశం దగ్గరలోనే ఉంది. 

Continues below advertisement

డిసెంబర్ 30న ప్రకటించే అవకాశం
మరొక్క రోజు తర్వాత, అంటే, శుక్రవారం (డిసెంబర్ 30, 2022) నాడు కేవలం మీ కోసమే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేయవచ్చు. చిన్న మొత్తాల పొదుపు పథకాల మీద వడ్డీ రేట్లను పెంచుతూ ప్రకటన జారీ చేయవచ్చు. 

2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం కోసం (జనవరి-మార్చి నెలల కోసం), చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సమీక్షిస్తుంది. దీనిలో PPF, సుకన్య సమృద్ధి యోజన, జాతీయ పొదుపు పత్రం (National Savings Certificate) వంటి పొదుపు పథకాల మీద వడ్డీ రేట్లు పెరగవచ్చని మార్కెట్‌ భావిస్తోంది. ఈ పొదుపు పథకాలు సహా పోస్ట్‌ ఆఫీస్‌ ఇతర పొదుపు పథకాలపై కూడా వడ్డీ రేట్లు పెరగవచ్చు. 

చిన్న మొత్తాల పొదుపులకు సంబంధించిన అన్ని పథకాల మీద అర శాతం (0.50 శాతం) వడ్డీ రేట్లను ఆర్థిక మంత్రిత్వ శాఖ పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రభుత్వ 10 సంవత్సరాల బాండ్ ఈల్డ్ 6.04 శాతం నుంచి 12 నెలల్లో 7.25 శాతానికి పెరిగింది. ఈ ఫార్ములా ప్రకారం... PPF, సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌ల మీద వడ్డీ రేటును ప్రస్తుత స్థాయి నుంచి 50 బేసిస్ పాయింట్లు (0.50 శాతం) పెంచవచ్చు.

వరుసగా ఐదోసారి రెపో రేటును పెంచుతూ, డిసెంబర్ 8, 2022న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ప్రకటించింది. ఈ పెంపుతో కలిపి, 2022లో, రెపో రేటు 4 శాతం నుంచి 6.25 శాతానికి పెంచింది. దీనికి అనుగుణంగా అనేక చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం పెంచలేదు. PPF, సుకన్య సమృద్ధి యోజన, NSC వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు లేదు. PPF మీద 7.1 శాతం, NSC మీద 6.8 శాతం, సుకన్య సమృద్ధి యోజన మీద 7.6 శాతం వడ్డీని అలాగే ఉంచింది. రెపో రేటును 2.25 శాతం (4 శాతం నుంచి 6.25 శాతానికి) పెంచిన నేపథ్యంలో, ఇప్పుడు ఈ పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం పెంచవచ్చు. 

కొన్ని పథకాల మీద వడ్డీ రేట్లు పెంపు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) మూడో త్రైమాసికంలో (అక్టోబర్‌-డిసెంబర్‌) కిసాన్ వికాస్ పత్రాల మీద వడ్డీ రేటును 6.9 శాతం నుంచి 7 శాతానికి కేంద్రం పెంచింది. అయితే.. మెచ్యూరిటీ వ్యవధిని 124 నెలల నుంచి 123 నెలలకు తగ్గించింది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌ మీద ఇచ్చే వడ్డీ రేటును 7.4 శాతం నుంచి 7.6 శాతానికి పెంచింది. పోస్టాఫీసు నెలవారీ ఆదాయ ఖాతా పథకంలో 6.6 శాతానికి బదులుగా 6.7 శాతం, రెండేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం మీద 5.5 శాతానికి బదులుగా 6.7 శాతం, 3 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ మీద 5.5 శాతానికి బదులుగా 5.7 శాతం చేశారు. 

Continues below advertisement