Indian Cricket Team Overhaul:
పొట్టి క్రికెట్‌ను గట్టిగా ఆడే జట్టును రూపొందించాలని బీసీసీఐ పట్టుదలగా ఉంది. రాబోయే రెండేళ్లు కుర్రాళ్లకే అవకాశాలు ఇవ్వనుంది. సంప్రదాయ ఆటతీరును కాదని డేరింగ్ అండ్ డ్యాషింగ్ అప్రోచ్‌కు ఓటేసింది. ఇకపై టీ20 అవకాశాలివ్వడం కష్టమేనని ఆరుగురు సీనియర్ క్రికెటర్లకు నిక్కచ్చిగా చెప్పేసిందట. ఆ జాబితాలో విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఉండటం విస్మయం కలిగిస్తోంది.
లంక సిరీసుతో నాంది!
శ్రీలంకతో వన్డే, టీ20 సిరీసులకు ఎంపిక చేసిన జట్లను గమనించండి. పొట్టి ఫార్మాట్లో విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చారు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేడు. పెళ్లి ముహూర్తం దగ్గరపడటంతో కేఎల్ రాహుల్ ఎంపికవ్వలేదు. దాంతో టీ20 సిరీసుకు హార్దిక్ పాండ్య పూర్తి స్థాయి నాయకుడిగా మారాడు. సూర్యకుమార్ యాదవ్ అతడికి డిప్యూటీగా ఉన్నాడు. ఇక వన్డేల్లో పాండ్య వైస్ కెప్టెన్ అయ్యాడు.
ఆరుగురు వీరే!
లంక సిరీసుకు జట్లను ఎంపిక చేసే ముందే బీసీసీఐ పెద్దలు కఠిన నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇకపై టీ20 జట్టులోకి తీసుకొనేది లేదని మహ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్, దినేశ్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్‌కు స్పష్టంగా చెప్పేశారట. ఒకప్పటితో పోలిస్తే మున్ముందు తక్కువ అవకాశాలే ఇస్తామని విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు వివరించారని తెలిసింది. భవిష్యత్తు ప్రణాళికలో భాగంగానే ఇలా చేయాల్సి వస్తోందని వారికి నచ్చజెప్పింది.
వయసు కారకం!
మహ్మద్ షమి, రవిచంద్రన్ అశ్విన్, దినేశ్ కార్తీక్ వయసు 34 ఏళ్లు దాటేసింది. భువీకి 32 ఏళ్లే అయినా ఒకప్పటి ఫామ్‌లో లేడు. కీలకమైన సిరీసులు, సెమీస్, ఫైనళ్లలో వికెట్లే పడగొట్టడం లేదు. దాంతో ఈ నలుగురికి బోర్డు తలుపులు మూసేసింది. ధావన్ ఎప్పట్నుంచో ప్రణాళికల్లో లేడు. కింగ్ కోహ్లీ ఈ మధ్యే ఫామ్‌లోకి వచ్చినా ఒకప్పటితో పోలిస్తే తక్కువ ప్రభావం చూపిస్తున్నాడు. అప్పుడప్పుడు టీ20లు ఆడించినా 2024 టీ20 ప్రపంచకప్ ప్రణాళికల్లో లేడని తెలిసింది. గాయాల పాలవుతున్న రోహిత్‌నూ పొట్టి ఫార్మాట్లో చూడటం ఇకపై కష్టమే. ఈ ఏడాది స్వదేశంలో వన్డే ప్రపంచకప్ జరుగుతోంది. ఈ మెగా టోర్నీకి వీరిద్దరూ తాజాగా ఉండాలని బోర్డు భావిస్తోంది.
ఊగిసలాటలో వీరు!
గాయం వల్ల టీ20, వన్డే సిరీసుల నుంచి రిషభ్ పంత్‌ను తప్పించారు. అవకాశాలు ఇచ్చినా మెరుగ్గా ఆడటం లేదని కేఎల్ రాహుల్‌పై విమర్శలు వస్తున్నాయి. ఇకపై అంచనాలను అందుకుంటేనే పొట్టి ఫార్మాట్లో వీరికి అవకాశాలు ఇస్తారని తెలిసింది. ఏడాది కాలంగా వీరిద్దరి ప్రదర్శన స్థాయికి తగినట్టు లేదు.
ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు!
'మేం 2024 టీ20 ప్రపంచకప్‌కు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. అప్పటికి మా టాప్ ఆటగాళ్లలో కొందరి వయసు 35-36 మధ్య ఉంటుంది. సుదీర్ఘ ప్రణాళికకు వారు సరిపోరు. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు జట్టును నిర్మించగలం. మీరిక టీ20ల్లో భాగమవ్వలేరు అని కొందరికి చెప్పేశాం. రోహిత్ ఇంకా 100 శాతం కోలుకోలేదు. అందుకే రిస్క్ తీసుకోవడం లేదు. జడేజా, బుమ్రా ఎన్‌సీఏకు చేరుకున్నారు. శారీరకంగా పుంజుకుంటున్నారు. ఫిట్‌నెస్ పరీక్ష నెగ్గితే సెలక్షన్‌కు అందుబాటులో ఉంటారు' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.