ICC Men’s Emerging Cricketer 2022:  భారత యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఐసీసీ పురుషుల ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- 2022 అవార్డుకు నామినేట్‌ అయ్యాడు. అతనితోపాటు దక్షిణాఫ్రికా పేస్- ఆల్ రౌండర్ మార్కో జాన్సన్, అఫ్ఘనిస్థాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్, న్యూజిలాండ్ బ్యాటర్ ఫిన్ అలెన్ కూడా నామినేట్ అయ్యారు. 


ఈ ఏడాది జూలైలో అర్ష్‌దీప్ సింగ్  టీ20ల్లో అరంగేట్రం చేశాడు. అప్పటినుంచి మొత్తం 21 మ్యాచ్ లలో 18.12 సగటుతో 33 వికెట్లు తీశాడు. టీ20 ప్రపంచకప్ లో అద్భుత ప్రదర్శన చేశాడు. పాకిస్థాన్ పై లీగ్ మ్యాచ్ లో చివరి ఓవర్లో 7 పరుగులను కాపాడేందుకు అర్ష్‌దీప్ సింగ్  చేసిన ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంది. ఎడమచేతివాటం పేసర్ అయిన అర్ష్‌దీప్ సింగ్  మంచి నియంత్రణతో బౌలింగ్ చేస్తాడు. పవర్ ప్లే, డెత్ ఓవర్లలో ఆకట్టుకున్నాడు. నాణ్యమైన యార్కర్లను సంధించగలడు. ప్రస్తుతం శ్రీలంకతో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్ కు అర్ష్‌దీప్ సింగ్  జట్టులో స్థానం దక్కించుకున్నాడు. 


ఆ ముగ్గురు కూడా


దక్షిణాఫ్రికా ఆటగాడు మార్కో జాన్సన్ ఈ సంవత్సరం 14 టెస్ట్ వికెట్ల తీశాడు. ఇంగ్లండ్ తో ఓవల్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. బ్యాట్ తో 30 పరుగులు చేసిన జాన్సన్, బంతితో 5 వికెట్లు పడగొట్టాడు. వైట్ బాల్ ఫార్మాట్ లో 4 మ్యాచ్ లు ఆడిన మార్కో 3 వికెట్లు తీసుకున్నాడు. అఫ్ఘనిస్తాన్ ఓపెనర్ జద్రాన్ ఈ ఏడాది టీ20, వన్డేల్లో తన జట్టు తరఫున నిలకడైన ప్రదర్శన చేశాడు. 7 వన్డేల్లో 71.83 సగటుతో 431 పరుగులు సాధించాడు. స్ట్రైక్ రేట్ 88.31. అలాగే టీ20ల్లో 109.55 సగటుతో 367 పరుగులు చేశాడు. పల్లెకలెలో శ్రీలంకతో జరిగిన వన్డేల్లో 162 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరు చేశాడు. 


న్యూజిలాండ్ బ్యాటర్ ఫిన్ అలెన్ కూడా ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డ్ రేసులో నిలిచాడు. ఈ ఏడాది టీ20ల్లో తుపాన్ ఇన్నింగ్సు లతో రాణించాడు. స్కాట్ లాండ్ పై కేవలం 56 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఆస్ట్రేలియాతో 24 బంతుల్లో 42 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. వన్డేల్లోనూ నిలకడగా పరుగులు సాధించాడు. వెస్టిండీస్, టీమిండియాలపై అర్ధసెంచరీలు సాధించాడు. 


మహిళల విభాగంలో భారత్ నుంచి ఇద్దరు


మహిళల విభాగంలో భారత్‌ నుంచి పేసర్‌ రేణుక సింగ్‌ ఠాకూర్, బ్యాటర్‌ యాస్తిక భాటియా పోటీలో ఉన్నారు. డార్సీ బ్రౌన్‌ (ఆస్ట్రేలియా), అలైస్‌ క్యాప్సి (ఇంగ్లాండ్‌) పేర్లు కూడా అవార్డు జాబితాలో ఉన్నాయి. ఐసీసీ అవార్డ్స్ మొత్తం 13 కేటగిరీలను కలిగి ఉంది. నిర్దిష్ట ఫార్మాట్లలో మంచి ప్రదర్శన చేసిన వాళ్లకు అవార్డులు ఇస్తారు. జనవరిలో ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఐసీసీ పేర్కొంది.