IND vs SL T20I Series: సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో సూపర్ ఫాంలో ఉన్న బ్యాటర్. ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో అగ్రస్థానంలో ఉన్నాడు. అంతేకాదు అరంగేట్రం చేసిన మొదటి ఏడాదిలోనే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానం సంపాదించాడు. 2022లో మొత్తం 42 టీ20లు ఆడిన సూర్య 1408 పరుగులు చేశాడు. 180కి పైగా స్ట్రైక్ రేట్, 44 సగటు సాధించాడు.
వైస్ కెప్టెన్ సూర్య
జనవరిలో స్వదేశంలో శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్ కు సూర్యకుమార్ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. తను సాధించిన విజయాలకు ఫలితంగా పదోన్నతి పొందాడు. వైస్ కెప్టెన్ గా ఎంపికవడం గురించి సూర్యను ప్రశ్నించగా.. తనకు ఇది ఒక కలలాగా ఉందని చెప్పాడు. అసలు అలా జరుగుతుందనే ఆశ తనకు లేదన్నాడు. రంజీ ట్రోఫీ మ్యాచ్ లో భాగంగా బుధవారం సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్ లో సూర్య 95 పరుగులు చేశాడు.
దాని తరువాత సూర్య మాట్లాడాడు. 'మా నాన్న సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివేట్ గా ఉంటారు. బీసీసీఐ శ్రీలంకతో మ్యాచ్ లకు స్క్వాడ్ ను ప్రకటించాక ఆ జాబితాను నాన్న నాకు పంపారు. టీ20ల్లో వైస్ కెప్టెన్ గా ఎంపికవడాన్ని నేను నమ్మలేకపోయాను. ఇది నిజమేనా అని మా నాన్నను అడిగాను. ఆ తర్వాత దాని గురించి మేం మాట్లాడుకున్నాం. ఎక్కువ ఒత్తిడి తీసుకోకుండా, నా బ్యాటింగ్ ను ఆస్వాదించమని నాన్న చెప్పారు.' అని సూర్యకుమార్ అన్నాడు.
ఆ కష్ట ఫలాన్ని ఇప్పుడు పొందుతున్నాను
గతేడాది టీ20ల్లో సూర్య హవా కొనసాగింది. 'వైస్ కెప్టెన్సీ ఇవ్వడం గురించి నాకు ఎలాంటి అంచనాలు లేవు. అయితే గత సంవత్సరం నేను సాధించినదానికి దీన్ని బహుమతిగా భావిస్తున్నాను. ఇది ఎన్నో సంవత్సరాల నా కష్టానికి ఫలితం. ఆ కష్ట ఫలాలను ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. ప్రస్తుతం జరుగుతున్న విషయాలతో నేను చాలా సంతోషంగా ఉన్నాను' అని సూర్య తెలిపాడు.