Electric Vehilcles : ఎలక్ట్రిక్ స్కూటర్లలో బ్యాటరీలు పేలుతున్న ఘటనలు తరచూ వినిపిస్తున్నాయి. ఈ ఘటనల నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో లోపాలు ఉన్నా, నిర్లక్ష్యం వహించినా తయారీదారులపై భారీ జరిమానా విధిస్తామని, దాంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఇలాంటి ఘటనలపై విచారించేందుకు నిపుణల కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే లోపాలున్న ఎలక్ట్రిక్ వాహనాలను కంపెనీలు స్వచ్చందంగా వెనక్కి తీసుకోవాలని పేర్కొన్నారు. బ్యాటరీ స్వాపింగ్ పాలసీ, బడ్జెట్ ఈవీలను కొనుగోలు చేసే వారికి ప్రోత్సాహకాలు, బ్యాటరీని పరీక్షించేటప్పుడు కచ్చితమైన ప్రమాణాలు వంటి కీలకమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి అజయ్ ఆదేశించారు.
తెలంగాణ ఈవీ హబ్
ఇటీవలికాలంలో ఎలక్ట్రిక్ టూవీలర్లు మంటల్లో చిక్కుకుపోతుండటం, ప్రాణనష్టానికి దారితీస్తున్న నేపథ్యంలో లోపాలున్న వాహనాలను సరిచేయాలని ఆయా కంపెనీలను మంత్రి అజయ్ కోరారు. ఎలక్ట్రిక్ వాహనాలకు తెలంగాణ ఎంతో అనువైన మార్కెట్ అని అతి త్వరలోనే ఈవీ హబ్ గా రాష్ట్రం మారబోతుందని మంత్రి అజయ్ వెల్లడించారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదాలు ఎక్కువగా ఏం జరగలేదన్నారు. ప్రస్తుతం ఎండాకాలం కావడం వల్ల అధిక ఉష్ణోగ్రతలు బ్యాటరీలకు సమస్యగా పరిణమించాయన్నారు. ఏది ఏమైనా వినియోగదారుల భద్రతే తొలి ప్రాధాన్యత అన్నారు. వినియోగదారుల రక్షణకు కంపెనీలు పెద్దపీట వేయాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.
ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదాలు
తెలంగాణలో మరో ఎలక్ట్రిక్ బైక్ లో మంటలు చెలరేగాయి. హైదరాబాద్ ఎల్బీనగర్ చౌరస్తాలో ఓ ఎలక్ట్రిక్ బైక్ లో మంటలు రేగాయి. డెలవరీ బాయ్ ఎలక్ట్రిక్ బైక్ మంటల్లో ఆహుతి అయింది. డెలివరీ బాయ్ ఆర్డర్ పికప్ చేసుకుని వచ్చే సరికి అతని ఎలక్ట్రిక్ బైక్ లో ఒక్కసారిగా మంటలు లేచాయి. స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. ఇంతలో అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. అకస్మాత్తుగా ఎలక్ట్రిక్ బైక్ లో మంటలు వచ్చినట్టు స్థానికులు తెలిపారు.
కరీంనగర్ లో ఎలక్ట్రిక్ బైక్ లో మంటలు
ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు చెలరేగుతున్నాయి. బైక్ లు అగ్నికి ఆహుతి అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మూడు రోజుల కిందట కరీంనగర్ లో ఓ ఎలక్ట్రిక్ బైక్ మంటల్లో తగలబడింది. కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండలం రామచంద్రాపూర్‌లో ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ పేలింది. వివరాలు. ఎగుర్ల ఓదెలు రెండు నెలల క్రితం బెన్లింగ్ ఫాల్కన్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేశారు. ఎప్పటిలాగే ఆదివారం రాత్రి పడుకునే ముందు బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టాడు. అయితే ఛార్జింగ్ పెట్టిన కొద్ది నిమిషాలకే బ్యాటరీ ఆఫ్ అయింది. ఆ తర్వాత బ్యాటరీలో పేలుడు సంభవించింది. అయితే అదృష్టవశాత్తూ ఇంటి బయట బ్యాటరీని ఛార్జింగ్ పెట్టడంతో పేలుడు జరిగిన సమయంలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. ఈ ప్రమాదంలో బైక్ పూర్తిగా దగ్ధమైంది.