Retail inflation Hike: పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రజలందరికీ రోజురోజుకూ షాకులిస్తోంది! వార్షిక ప్రాతిపదికన ఏప్రిల్‌లో రిటైల్‌ ఇన్‌ఫ్లేషన్‌ ఏకంగా 7.79 శాతానికి పెరిగింది. అటు వంట నూనె, ఇటు చమురు ధరలు కొండెక్కడమే ఇందుకు ప్రధాన కారణం. గురువారం కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ ద్రవ్యోల్బణం గణాంకాలు విడుదల చేసింది.


రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లక్షిత ద్రవ్యోల్బణం 6 శాతం లోపే ఉండాలని నిర్ణయించుకుంది. గణాంకాలను చూస్తుంటే మాత్రం వరుసగా నాలుగో నెల ఇన్‌ఫ్లేషన్‌ ఆ స్థాయిని మించే ఉంటోంది.  విశ్లేషకులు వినియోగ ధరల సూచీ (CPI Inflation) ద్రవ్యోల్బణాన్ని  7.5 శాతంగా అంచనా వేసిన సంగతి తెలిసిందే. అంటే మార్చి నెలలోని 6.95 శాతంతో పోలిస్తే ఇదెంతో ఎక్కువ. 2021 ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం 4.23 శాతమే ఉండటం గమనార్హం.


మార్చిలో 7.66 శాతంతో పోలిస్తే ఏప్రిల్‌లో గ్రామీణ ద్రవ్యోల్బణం 8.83 శాతానికి పెరిగింది. ఇక 2021 ఏప్రిల్‌లో అయితే ఇది 3.75 శాతమే. పట్టణ ద్రవ్యోల్బణం మార్చిలో 6.12 శాతం ఉండగా ఏప్రిల్‌లో 7.09 శాతానికి పెరిగింది. 2021, ఏప్రిల్‌లో ఇది 7.09 శాతంగా ఉంది. మొత్తంగా ఏప్రిల్‌ నెలలో ఆహార ద్రవ్యోల్బణం 8.38 శాతానికి చేరుకుంది. మార్చిలో ఇది 7.68 శాతం కాగా 2021 ఏప్రిల్‌లో 1.96 శాతమే.


ద్రవ్యోల్బణం నుంచి ఎకానమీని రక్షించేందుకు గత వారం ఆర్బీఐ రెపో రేటును 40 బేసిస్‌ పాయింట్ల మేర పెంచిన సంగతి తెలిసిందే. 'ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయిందని మానిటరీ పాలసీ కమిటీ అంచనా వేసింది. దాని ప్రభావం నుంచి బయటపడేందుకు చర్యలు తీసుకోవడం మొదలు పెట్టింది. 2023 ఆర్థిక ఏడాదిలో సీపీఐని 5.3-5.5 శాతం నుంచి 6 శాతంగా అంచనా వేస్తున్నాం. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, ముడి చమురు ధరల పెరుగుదల ద్రవ్యోల్బణాన్ని ఎక్కువ రోజులు కొనసాగించేలా ఉంది' అని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే.