Minister Mallareddy : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు మంత్రి మల్లారెడ్డి ఓపెన్ సవాల్ విసిరారు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ గ్రామాల్లాంటి ఒక్క గ్రామాన్ని చూపించాలని సవాల్ చేశారు. అలాంటి ఒక్క గ్రామం చూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. అలాగే రాజకీయ సన్యాసం చేస్తానన్నారు. ఎంత సమయం తీసుకుంటారో తీసుకోండన్నారు. తెలంగాణ గ్రామాల్లో సాగు నీరు, త్రాగు నీరు, డంపింగ్ యార్డు, హరితహారం, గ్రేవ్ యార్డు, 24 గంటల కరెంట్ ఇలా అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. ఇలాంటి ఒక్క గ్రామాన్ని బీజేపీ పాలిత 19 రాష్ట్రాల్లో చూపించాలని బండి సంజయ్ కు మంత్రి మల్లారెడ్డి సవాల్ విసిరారు. 


కేసీఆర్ రైతును రాజు చేశారు 


తెలంగాణ రాష్ట్రం రాక ముందు రైతులకు న్యాయం జరగలేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. అప్పుడు పంట పండిస్తే గిట్టుబాటు ధర ఉండేది కాదన్నారు. రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ రైతును రాజును చేశారన్నారు. ఇంజినీర్ అవతారం ఎత్తి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని తెలిపారు. రైతుకు పెట్టుబడి కోసం పది వేల రూపాయలు, రైతు బీమాతో ఐదు లక్షలు అందిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో 12700 గ్రామాలను అభివృద్ధి చేశారన్నారు. బెస్ట్ గ్రామ పంచాయతీలలో 20 లో 19 తెలంగాణావే ఉన్నాయని గుర్తుచేశారు. పండిన వడ్లను ఆరబెట్టుకునే కల్లాలను కట్టించారన్నారు. రైతుల కోసమే కల్లాలను కట్టారన్నారు. ఆ పైసల్ వెనక్కి ఇవ్వమని అడడం న్యాయం కాదన్నారు. మోదీ ఇంట్ల నుంచి ఇస్తున్నారా పైసల్ అని ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాలను పైసల్ వాపస్ ఇవ్వమని అడగాలన్నారు.  బ్యాంకులను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వారిని వదిలిపెట్టి రైతుల కోసం ఖర్చు చేసిన పైసల్ ఇవ్వమంటరా? అని నిలదీశారు.  


మల్లారెడ్డి కళాశాలలో ఫార్మాథాన్ 


 మల్లారెడ్డి అగ్రికల్చరల్ కళాశాలలో శుక్రవారం అంతర్జాతీయ రైతు దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  ఫార్మాథాన్ నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు.  మల్లా రెడ్డి విశ్వవిద్యాలయం వ్యవసాయంలో తాజా పురోగతుల గురించి రైతులకు అవగాహన కల్పించడానికి "ఫార్మాథాన్" అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. మంత్రి మల్లారెడ్డి యూనివర్సిటీ ఛైర్మన్‌ భద్రారెడ్డి తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. మంత్రి మల్లారెడ్డి  మాట్లాడుతూ, “ప్రపంచంలో వ్యవసాయం అత్యంత కీలకమైన పరిశ్రమ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల జీవనోపాధి ఈ వ్యవసాయరంగం. ఆహారం ఇతర ఉత్పత్తుల ఉత్పత్తి ఈ రంగంపై ఆధారపడి ఉంటుంది. వ్యవసాయాన్ని కాపాడటానికి, పంట దిగుబడిని పెంచడానికి, ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరచడానికి పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి వ్యవసాయ శాస్త్రాన్ని ప్రోత్సహిస్తున్నాం. రైతు సమాజంలో అవగాహన కల్పించేందుకు మేము ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉంటాం” అన్నారు. 


రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన 


ధాన్యం ఆరబోత కల్లాలకు ఖర్చుపెచ్చిన నిధులు వాపస్ చేయాలని కేంద్రం తెలంగాణను ఆదేశించింది. దీనిపై తెలంగాణ మంత్రులు మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు, అన్నదాతలు ఆందోళనలు చేశారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులు నిర్మించుకున్న పంట ఆరబోత కల్లాలపై కేంద్రం క‌క్షపూరితంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. ఉపాధి హామీ నిధులతో పంట కల్లాలు నిర్మిస్తే తప్పేంటని నిలదీస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, పార్టీ శ్రేణులు ధర్నాకు దిగారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నేతల, ప్రజా ప్రతినిధులు, రైతులు నిరసనలు చేపట్టారు.