KTR Inaugurates LB Nagar Flyover : హైదరాబాద్ మణిహారంలో మరో ఫ్లైఓవర్ చేసింది. ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించారు. వనస్థలిపురం నుంచి దిల్‌సుఖ్‌నగర్ మార్గంలో చేపట్టిన ఈ నూతన వంతెన అందుబాటులోకి రావడంతో విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వారికి ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పుతాయి. మొత్తం 760 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు ఉన్న వంతెనను రూ.32 కోట్ల వ్యయంతో మూడు లేన్ల ఫ్లైఓవర్‌గా నిర్మించారు. ఎస్సార్డీపీలో 19వ ప్రాజెక్టుగా ఈ ఫ్లైఓవర్ ను నిర్మించారు.  దీంతో ఏపీ నుంచి ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చే ప్రజలతో పాటు హయత్‌నగర్‌ మీదుగా ఎలాంటి ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా ప్రయాణించవచ్చు. 




1000 పడకల ఆసుపత్రి 


ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ నియోజకవర్గంలో 9వ ప్రాజెక్టుగా ఈ పైవంతెనను ప్రారభించామన్నారు. ఎస్సార్డీపీలో చేపట్టిన 12 ప్రాజెక్టులో 9 ఇప్పటికే పూర్తిచేశామన్నారు. గతంలో ఎల్బీనగర్ చౌరస్తా దాటలాంటే చాలా ఇబ్బందులు పడేవారన్నారు. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ నిర్మాణాలతో ట్రాఫిక్ కష్టాలు తప్పాయని చెప్పారు. ఎల్బీనగర్ మెట్రో ప్రాజెక్టును నాగోల్ వరకూ పొడిగిస్తామన్నారు. భవిష్యత్తులో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజారోగ్యంపై దృష్టిపెట్టి ఎల్బీనగర్ నియోజకవర్గంలో 1000 పడకల టిమ్స్ గడ్డి అన్నారంలో నిర్మిస్తున్నామన్నారు.


సిగ్నల్ ఫ్రీ కూడలి


 ఎల్బీనగర్‌ కూడలిలో మరో ఫ్లైఓవర్‌ ఓపెన్ అయింది. రూ.32 కోట్ల వ్యయంతో ప్రభుత్వం నిర్మించిన హయత్‌నగర్‌ నుంచి దిల్‌సుఖ్‌నగర్‌ వైపు వెళ్లే ఫ్లై ఓవర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. దీంతో రెండో ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రావడంతో ఎల్బీనగర్‌ కూడలి ఇప్పుడు సిగ్నల్‌ ఫ్రీగా మారింది. ఓ ఫ్లైఓవర్‌, 2 అండర్‌పాస్‌లు గతంలోనే అందుబాటులోకి తీసుకొచ్చారు.  


శ్రీకాంతాచారి పేరు 


"స్థానికంగా ప్రజలు కోరుకునే మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. జీవో నెంబర్ 58, 59 ద్వారా గతంలో 1.25 లక్షల మందికి పట్టాలిచ్చాం. ఈ జీవో టైం పెంచాం. ఎక్కడైనా పేదలు ఉంటే వాళ్లకు కూడా పట్టాలిస్తాం. ఎస్ఎన్డీపీ కార్యక్రమాల ద్వారా నాలాలు పునరుద్దరిస్తున్నాం. ఈ ఫ్లైఓవర్ కు శ్రీకాంతాచారి పెడతాం. ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోనే 12 ప్రాజెక్టులు చేపట్టాం. ఇప్పటికే 9 ప్రాజెక్టులు పూర్తి కాగా మిగతా 3 ఫ్లై ఓవర్లను సెప్టెంబరులోపు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తాం. నాగోల్‌ మెట్రోను ఎల్బీనగర్ వరకు అనుసంధానం చేస్తాం. ఎన్నికల తర్వాత మెట్రోను హయత్‌నగర్‌ వరకు పొడిగిస్తాం. ఎల్బీనగర్‌ మెట్రో మార్గాన్ని విమానాశ్రయంతో అనుసంధించే ఆలోచన ఉంది. ఏడాదిన్నరలోపే కొత్తపేట మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొస్తాం. ఎల్బీనగర్‌ చౌరస్తాకు తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి పేరు పెడతాం. ఈ మేరకు త్వరలోనే ఆదేశాలు జారీ చేస్తాం" - మంత్రి కేటీఆర్