Minister Kakani : వైసీపీలో రాజకీయ సంక్షోభం రాదని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినంత మాత్రాన పార్టీకి నష్టం లేదన్నారు. ఆ ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకున్నారని అధిష్ఠానం వద్ద ఆధారాలున్నాయన్నారు.  ఒక పార్టీ గుర్తుపై గెలిచి, ఇంకో పార్టీ అభ్యర్థికి ఓటు వేయడం నైతికత కాదని, అందుకే వారిపై పార్టీ వేటు వేసిందని అన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. తప్పు చేసిన వారిని వెలేస్తారని, అంతే కాని ముద్దు పెట్టుకోరని సెటైర్లు వేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఎమ్మెల్యేలు నోరు పెంచారని, అంతకు ముందు సమస్యలపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఆ నలుగురు టీడీపీ అభ్యర్థికి ఓటు వేసినట్టు తమ వద్ద ఆధారాలున్నాయని, అందుకే సస్పెండ్ చేశామన్నారు. వారు పార్టీని వదిలేసి వెళ్లిపోయినంత మాత్రాన వచ్చిన నష్టమేమీ లేదన్నారు కాకాణి. 


పార్టీ కేడర్ మొత్తం మాతోనే 
 
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసి వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నారనే ఆధారాలు అధిష్ఠానం వద్ద ఉన్నాయని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...వైసీపీ అధిష్ఠానం వద్ద ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్యేలపై వేటు పడిందన్నారు. వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఆ ఎమ్మెల్యేలు ఎవరికి ఓటు వేశామనే విషయంపై ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. నెల్లూరు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీని వీడినా... తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. పార్టీ కేడర్ మొత్తం తమవైపే ఉందని మంత్రి కాకాణి ధీమా వ్యక్తం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలపై ఈ ప్రభావం ఏమాత్రం ఉండదని స్పష్టం చేశారు. జిల్లా పార్టీలో లోటుపాట్లపై దృష్టిసారిస్తామన్నారు.  


రూ.10 కోట్లకు బేరం 


 వైసీపీకి దమ్ముంది కాబట్టి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసిన నలుగురిపై సస్పెన్షన్ వేటు వేసిందని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. అలాంటి దమ్ము, ధైర్యం టీడీపీకి ఉందా అని ప్రశ్నించారు. టీడీపీ నుంచి వచ్చిన నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ అభ్యర్థికి ఓటు వేశారని, ఆ విషయం స్పష్టంగా తెలిసినా కూడా టీడీపీకి వారిపై చర్యలు తీసుకునే ధైర్యం లేదని చెప్పారు. తమ ఎమ్మెల్యేలు రూ.15 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయారంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు రూ.10 కోట్ల డీల్ ఫిక్స్ చేసుకున్నారని ఆరోపించారు.  ఇద్దరు ఎమ్మెల్యేలు 10 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయారని విమర్శించారు. చంద్రబాబుకి ఇలాంటి వవ్యవహారాలు అలవాటేనన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి. గతంలో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డితో బేరాలు నడిపారని, ఓటుకు నోటు స్కామ్ లో అరెస్ట్ చేస్తారనే భయంతో ఏపీకి పారిపోయి వచ్చారన్నారు. ఇప్పుడు ఏపీలో కూడా అలాగే ఓట్లని నోట్లతో కొన్నారని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది ఒక్క సీటేనని, తమకు ఆరు సీట్లు వచ్చాయని చెప్పుకొచ్చారు. విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారాయన. కోవూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 52 సచివాలయాల పరిధిలో 57 వేల 379 గడపలు తిరిగానని చెప్పుకొచ్చారు.