YSR Asara Scheme: వివిధ పథకాలతో రాష్ట్ర మహిళలకు చేయూతనిస్తూనే దిగ్గజ సంస్థలతో కలిసి వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించామన్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఏలూరు జిల్లా దెందులూరులో వైఎస్సార్ ఆసరా పథకంలో భాగంగా మూడో విడత ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం జగన్ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు వివరించారు.
మహిళలకు ఉపాధి కల్పించేందుకు తమ ప్రభుత్వ శాయశక్తుల కృషి చేస్తుందన్నారు సీఎం జగన్. ఆసరా, చేయూత, జీరో వడ్డీ ద్వారా మహిళలకు అండగా నిలిచామన్నారు. గత పాలకుల కంటే మెరుగైన విధానాలు తీసుకొచ్చి దేశానికే పొదుపు సంఘాల మహిళలు ఆదర్సంగా నిలబెట్టామని తెలిపారు.
పొదుపు సంఘాల పురోభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ చేపట్టిన విధానాలను ఇతర రాష్ట్రాలు వచ్చి పరిశీలిస్తున్నాయని తెలిపారు జగన్. ఎప్పటికప్పుడు బ్యాంకులతో మాట్లాడి వడ్డీ భారం మహిళలపై పడకుండా జాగ్రత్త తీసుకుంటున్నామన్నారు. వైఎస్సార్ ఆసరా పథకంలో భాగంగా 78.94 లక్షల మంది లబ్ధిదారులకు రూ.6,419.89 కోట్ల ఆర్థిక సాయం అందజేస్తున్నట్టు వివరించారు. 10 రోజుల పాటు ఏపీలో ఆసరా పంపిణీ ఉత్సవాలు జరగనున్నాయన్నారు.
ఎక్కడా లంచాలు ఉండవు, వివక్ష ఉండదు రూ.6,419.89 కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ అవుతాయన్నారు. ఈ మొత్తాన్ని ఎలా ఖర్చుచేసుకోవాలన్నదీ వాళ్ల ఇష్టానికి వదిలేస్తున్నట్టు చెప్పారు జగన్. స్వయం ఉపాధి పొందాలనుకుంటే.. ప్రభుత్వం పరంగా అండదండలు ఉంటాయన్నారు. అక్షరాల రూ.19,178 కోట్లు ఒక్క ఆసరా కార్యక్రమం ఇప్పటి వరకు ఇచ్చామన్నారు జగన్. మహిళలకు తోడ్పాటు ఇస్తూ, సలహాలు ఇస్తూ అన్నగా ప్రభుత్వం నిలబడుతుందన్నారు.
ఆసరా, చేయూత, సున్నా వడ్డీ ద్వారా అనేక కార్యక్రమాలను చేపట్టామని... 9 లక్షల మందికిపైగా మహిళలు వ్యాపారాలు చేసుకుంటున్నారని తెలిపారు. రూ.4355 కోట్లు బ్యాంకుల ద్వారా వారికి ఇచ్చామని తెలిపారు. తద్వారా వారి కుటుంబాలకు వారు అండగా నిలబడుతున్నారన్నారు.
2014-19 మధ్య పొదుపు సంఘాలకు సంబంధించిన సగటున వారికి వచ్చే బ్యాంకుల రుణాలు రూ.14వేల కోట్లు కాగా, ఇవాళ బ్యాంకుల ద్వారా ఏటా రూ.30 వేల కోట్లు సగటున అందుతోందన్నారు. 99.55 శాతం రుణాలను పొదుపు సంఘాలు చెల్లిస్తున్నారని వివరించారు. బ్యాంకులతో మాట్లాడి వడ్డీ శాతాలను తగ్గించామని తెలిపారు జగన్. ఇంకా తగ్గించేలా బ్యాంకర్ల మీద ఒత్తిడి తీసుకువస్తున్నామన్నారు. చంద్రబాబు వల్ల దెబ్బతిన్న పొదుపు సంఘాల ఉద్యమం మళ్లీ ఊపిరి పోసుకుందని అభిప్రాయపడ్డారు. ఎన్‌పీఏలు, ఓవర్ డ్యూలు కేవలం 0.45శాతం మాత్రమేనన్నారు. గత ప్రభుత్వం హయాంలో 18.36శాతం ఉందని గుర్తు చేశారు.
రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు గత ఎన్నికల్లో చెప్పారని విమర్శించారు జగన్. వారిని నిలువునా ముంచేశారని ఎద్దేవా చేశారు. 2016 అక్టోబరు నుంచి కూడా సున్నా వడ్డీ రుణాల పథకాన్ని చంద్రబాబు నిలిపేశారన్నారు. రూ.3వేల కోట్ల వడ్డీలు, చక్రవడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి సున్నావడ్డీ కింద రుణాలు వచ్చే పరిస్థితిని తీసుకు వచ్చామని తెలిపారు. 2016 అక్టోబరులో నిలిచిపోయిన ఈ పథకాన్ని తీసుకొచ్చి రూ.3600 కోట్లు చెల్లించామన్నారు.
ఈ 45 నెలల కాలంలో జగన్ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వంగా అడుగులు ముందుకేసిందన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకూ రూ.2,25,330.76 కోట్లు ఇచ్చామని లెక్కలు చెప్పారు. మహిళ వివక్ష మీద పోరాటం చేస్తోందీ ప్రభుత్వమని వివరించారు. నామినేటెడ్ పదవుల్లో 50శాతం ఇచ్చామని తెలిపారు. అక్క చెల్లెమ్మలకు ఎలాంటి హానీ కలగకూడదనే ఉద్దేశంతో దిశ యాప్ తీసుకొచ్చామని పేర్కొన్నారు.