Kakinada News: ముక్కుపచ్చలారని చిన్నారులను చంకన పెట్టుకుని మండుటెండలో భిక్షాటన చేస్తే ఇకపై జైలుకే పంపింస్తామంటున్నారు అధికారులు. కాకినాడలో పసి పిల్లలతో భిక్షాటన చేస్తున్న పలువురు మహిళలను అదుపులోకి తీసుకుని వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు.


అసలేం జరిగిందంటే..?


కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశాలతో జిల్లా బాలల సంరక్షణ అధికారి వెంకట్రావు పర్యవేక్షణలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ, విద్యాశాఖ, సమగ్ర శిక్ష, స్వచ్ఛంద సంస్థలు చైల్డ్ ఫండ్ ఇండియా సమన్వయంతో కాకినాడ పట్టణం, రూరల్ పరిసర ప్రాంతాలలో చైల్డ్ బెగ్గింగ్ నిర్మూలన డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ ద్వారా భిక్షాటన చేస్తున్న 21 మంది బాల బాలికలను గుర్తించి వారందరినీ పోలీసు వాహనాల ద్వారా జిల్లా బాలల పరిరక్షణ విభాగం కార్యాలయానికి తరలించారు. పోలీస్ శాఖ నుండి డీఎస్సీ మురళి కృష్ణా రెడ్డి, మహిళా శిశు శాఖ అధికారిని కె. ప్రవీణ ద్వారా చట్టపరమైన, సామాజికమైన, వివిధ రకాల పర్యవసానాలు గూర్చి వారికి అవగాహన కల్పించారు. భిక్షాటన నుండి వారిని వారి పిల్లలను రక్షించి, ప్రభుత్వపరంగా ఉన్న విద్య వసతి సౌకర్యాలను వారు సద్వినియోగం చేసుకునే విధంగా వారికి తెలియచేశారు. 


పిల్లలకు, వారి తల్లిదండ్రులుకు కౌన్సిలింగ్ నిర్వహించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబెర్ జె. సంతోష్ కుమారి సూచనల మేరకు పిల్లలతో భిక్షాటన చేయించమని చెప్పారు. ఇకపై అలా చేస్తే చట్టపరంగా ఉండే చర్యలకు బాధ్యత వహిస్తామని రాత పూర్వకంగా తల్లిదండ్రుల దగ్గర నుండి హామీ పత్రాన్ని తీసుకొని పిల్లలను వారికి అప్పగించారు. 


మండుటెండల్లో చిన్నారులతో భిక్షాటన...


కాకినాడ జిల్లాలోని ప్రధాన ప్రాంతాల్లో బాలలను చంకన వేసుకుని భిక్షాటన చేయడం ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లల్ని ఎండలో తిప్పుతూ భిక్షాటన చేస్తుండగా ఇలా చేస్తే పిల్లల్ని చూసి కొందరు జాలిపడి డబ్బులు ఎక్కువ ఇస్తారని ఆశతోనే ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నారని అధికారుల పరిశీలనలో తేలింది. కాకినాడకు చెందిన పలువురు సామాజిక వేత్తలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా వెంటనే స్పందించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ద్వారా పోలీసు శాఖ, పలు స్వచ్ఛంధ సంస్థలు సహకారంతో నగరంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. రూరల్ ప్రాంతాల్లోనూ రద్దీ ప్రదేశాల్లో సంచారం చేస్తూ బాలల పరిరక్షణకు విఘాతం కలిగిస్తున్న వారిని గుర్తించారు. గుంటూరు తదితర ప్రాంతాల నుండి వలస వాదులుగా వచ్చి మగవారు కత్తులు సాన పెట్టడం, చిన్న చిన్న పనులు చేసుకోవడం, మహిళలు చిన్న పిల్లలను చంకను వేసుకుని భిక్షాటన చేస్తున్నారని వారికి అవగాహన కల్పించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. 


జైలు శిక్ష తప్పదని హెచ్చరిక...


బాలలను చంకన వేసుకుని భిక్షాటన చేయడం వల్ల సులువుగా డబ్బులు సంపాధించేందుకు అలవాటు పడి అంగన్వాడీ కేంద్రాలకు బాలలను పంపడం లేదని, బాలలతో భిక్షాటన చేయడం చట్ట పరంగా నేరమని, స్వేచ్చగా చూడాల్సిన బాల్యాన్ని బిక్షాటనకు నిర్బంధిస్తున్న వారిపై కఠిన చట్టాలు అమలు అవుతాయని అధికారులు హెచ్చరించారు. బాలల న్యాయ చట్టం 2015, సెక్షన్ 76 (1) ప్రకారం ఐదు సంవత్సరాల జైలు శిక్ష, లక్ష రూపాయలు జరిమానా విధించబడుతుందని తెలిపారు.