Minsiter Harish Rao : ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణీల కోసం ఏర్పాటు చేసిన టిఫా స్కానింగ్ మిషన్లను మంత్రి హరీశ్ రావు శనివారం ప్రారభించారు. రాష్ట్రవ్యాప్తంగా 44 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 56 టిఫా స్కానింగ్‌ మిషన్లను మంత్రి హరీశ్ రావు పేట్ల బురుజు ఆసుపత్రి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. టిఫా స్కానింగ్‌ యంత్రాలు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి 100 మందిలో 7 శాతం శిశువుల్లో లోపాలుంటున్నాయని, వాటిని టిఫా మిషన్ ద్వారా ముందుగా గుర్తించడం సాధ్యమవుతుందన్నారు. పేట్ల బురుజు ఆసుపత్రిలో కేసీఆర్‌ కిట్‌ పథకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారని గుర్తుచేశారు. తెలంగాణలో 99.2 శాతం ఇన్‌స్టిట్యూషనల్‌ డెలివరీలు జరుగుతున్నాయన్నారు. 






56 టిఫా స్కానింగ్ మిషన్లు


తెలంగాణ ప్రభుత్వం మాతాశిశు సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. అందులో భాగంగానే రూ.20 కోట్ల వ్యయంతో 44 ప్రభుత్వ  ఆసుపత్రుల్లో 56 టిఫా స్కానింగ్ మిషన్లు ఏర్పాటు చేశామన్నారు. టిఫా మిషన్ల సాయంతో నెలకు 20 వేల మంది గర్భిణులకు స్కానింగ్ చేసేందుకు వీలు కలుగనుందన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ స్కానింగ్ లకు రూ.2 వేల నుంచి రూ.3వేల వరకు ఖర్చవుతుందని, ఇలాంటి సౌకర్యాన్ని ప్రభుత్వ దవాఖానాల్లో ఉచితంగా అందిస్తున్నామన్నారు. టిఫా మిషన్ల సాయంతో తల్లి గర్భంలో బిడ్డకు ఉన్న లోపాలను సులువుగా గుర్తించవచ్చని తెలిపారు. లోపాలు ముందుగా గుర్తిస్తే అవసరమైన వైద్య సహాయం అందించడానికి  వీలు ఉంటుందన్నారు. గర్భిణీలలో 18 నుంచి 22 వారాల మధ్యలో టిఫా స్కానింగ్‌ చేయనున్నారు. 


గాంధీ ఆసుపత్రిలో 2 టిఫా స్కానింగ్ మిషన్లు 


గాంధీ ఆస్పత్రిలో గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్య స్థితిని తెలుసుకొనేలా నూతనంగా ఏర్పాటు చేసిన 2 టిఫా స్కానింగ్ మిషన్లను  పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. గర్భిణీల ఆరోగ్య పరిస్థితిని మొదటి దశలోస చనే గుర్తించేందుకు ఆరోగ్యపరంగా ఎదురయ్యే సమస్యలను తెలుసుకునేందుకు  ఈ స్కానర్ దోహదపడుతుందని మంత్రి తలసాని అన్నారు. ఇలాంటి వైద్య సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు.  గాంధీ ఆస్పత్రిలో రూ.60 లక్షల విలువతో పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. తెలంగాణ ప్రభుత్వం వైద్య సేవల విషయంలో ముందుందన్నారు. నూతన పరిజ్ఞానంతో వైద్య రంగంలో కీలక మలుపులు తీసుకుని ప్రజారోగ్యాన్ని కాపాడుతున్నామన్నారు.