Fishermen Boat Racing : శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలో బోట్ రేసింగ్ గుర్తుందా?...  హీరో సుధీర్ బాబు చేపల వేట హద్దు కోసం హోరాహోరీగా తలపడి గెలుస్తాడు. అలాంటి సీన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఏటా జరుగుతుంది. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం బలుసుతిప్పలో మత్స్యకారులు చేపల వేట హద్దు కోసం గోదావరి పాయలో బోట్లతో పోటీ పడ్డారు. చేపల వేట హద్దుల కోసం బోట్ల పోటీ సందర్భంగా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కాట్రేనికోన ఎస్ఐ టి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. శనివారం ఉదయం 7 గంటలకు  బోట్ల పోటీ మొదలైంది. పల్లంకుర్రు, ఎదుర్లంక, దరియాలతిప్ప, యానాం నుంచి కోటిపల్లి వరకు ఉన్న ప్రాంతాలలో అధిక సంఖ్యలో చేపలు పడే ప్రాంతం కోసం బోట్లతో పోటీ పడి దక్కించుకుంటారు మత్స్యకారులు. ఈ పోటీలో సుమారు 100 బోట్లతో పోటీ పడ్డారు జాలర్లు. ముందుగా ఎవరైతే వెళ్లి ఆ ప్రాంతానికి చేరుకుంటారో వారికి గోదావరికి వరదలు వచ్చే వరకు ఆ ప్రాంతం వారి అధీనంలో ఉంటుంది. ఈ విధంగా పోటీ పడి తమ హద్దులు ఏర్పాటు చేసుకున్నారు. 



ఒకే రకమైన బోట్లతో రేసింగ్ 


గతంలో పోటీ కోసం లక్షలు చెల్లించి అద్దెకు స్పీడ్ బోట్లను తెచ్చి పోటీకి సిద్ధమయ్యేవారు. అధిక మొత్తంలో అద్దె చెల్లించి స్పీడ్ బోట్లు తెచ్చుకోలేని నిరుపేదలు చేపలు అధికంగా దొరికే హద్దును కోల్పోయేవారు. దీంతో ఈసారి అందరూ ఒకే రకం బోట్లు వాడాలని పెద్దలు నిర్ణయించారు. సొంత బోట్లులేని వారు స్థానికంగా దొరికే అద్దె బోట్లలో చేపల వేట స్థలాన్ని దక్కించుకొనేందుకు పోటీలో పాల్గొన్నారు. బలుసుతిప్పకి చెందిన మత్స్యకారులు చేపల వేట కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు గోదావరికి వరదలతో సొంత ఊరు చేరతారు. దీపావళి అనంతరం చేపల వేట హద్దుల కోసం పెట్టే బోట్ల పోటీలో పాల్గొంటారు. ఈ తంతు ప్రతీ ఏటా కొనసాగుతుంది. ఈ పోటీలో చేపల వేట హద్దులు దక్కించుకొని సుమారు మూడు వేల మంది లంగరు వలకట్లతో చేపల వేట చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు.  


ప్రాణహిత చేపలకు సూపర్ డిమాండ్ 


చెరువుల్లో దొరికే చేపలు రుచి ఒక ఎత్తయితే ప్రాణహిత నదిలో దొరికే  చేపల రుచి మరో ఎత్తు. వాటి ప్రత్యేకతే వేరు. ఒక్కసారి ఈ చేపలను రుచి చూశారో మళ్లీ కావాలంటారు. అంత టెస్ట్ ఉండే ప్రాణహిత చేపల కోసం ఇతర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఈ చేపల కోసం తీరం వెంట గంటల తరబడి వేచి చూసి కొనుగోలు చేస్తుంటారు. మంచిర్యాల జిల్లా సరిహద్దులో ప్రవహిస్తున్న ప్రాణహిత నదిలో లభించే చేపలు చాలా రుచికరంగా ఉంటాయని కొనుగోలుదారులు అంటున్నారు. దీంతో ఇటు మంచిర్యాల వాసులతో పాటు మహారాష్ట్ర, ఇవతలి తెలంగాణ సరిహద్దు ప్రాంతాల జాలర్లకు ఈ చేపలు ఉపాధి కల్పిస్తున్నాయి. చేపల రుచి నీటి ప్రవాహాలపై ఆధారపడి ఉంటుంది. పెంపకంగా దొరికే చేపలలా కాకుండా సహజంగా లభించే వాటికి మార్కెట్‌లో అధిక డిమాండ్‌ ఉంటుంది. ముఖ్యంగా ప్రాణహితలో లభ్యమయ్యే చేపలంటే మాంసప్రియులకు మరింత ఇష్టం. ఎక్కువ ధర వెచ్చించి మరీ కొనుగోలు చేస్తారు. రుచి ప్రత్యేకంగా ఉండటంతో ఈ చేపల కోసం ఇతర రాష్ట్రాల సరిహద్దు గ్రామాలతో పాటు పట్టణాల నుంచి ఇక్కడకు క్యూ కడతారు.