Lt Col Vinay Bhanu Reddy :  అరుణాచల్ ప్రదేశ్ లో ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో ల్యూటినెంట్ కల్నల్ వీవీబీ రెడ్డి అరుడయ్యారు. ఆయన స్వస్థలం తెలంగాణలోని యాదాద్రి జిల్లా బొమ్మలరామారం. ప్రస్తుతం ఆయన కుటుంబం మేడ్చల్ జిల్లా మల్కాజ్ గిరి దుర్గ నగర్ లో నివాసం ఉంటున్నారు. లెఫ్టినెంట్ కల్నల్ వినయ్ భాను రెడ్డి భౌతికకాయం పూణె నుంచి మల్కాజ్ గిరి దుర్గ నగర్ కు చేరుకుంది. అయిన భౌతిక కాయానికి తెలంగాణ గవర్నర్ తమిళి సై, ఆర్మీ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్ రావుతో పాటు ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు.  



హెలికాఫ్టర్ ప్రమాదంలో అమరుడైన వినయ్ భాను రెడ్డి


అరుణాచల్‌ ప్రదేశ్‌లో భారత సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్‌ రెండ్రోజుల క్రితం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు పైలట్లు అమరులయ్యారు. ఈ ఇద్దరిలో ల్యూటినెంట్ కల్నల్ వీవీబీ రెడ్డి స్వగ్రామం యాదాద్రి జిల్లా బొమ్మలరామారం.  దీంతో ఆయన స్వస్థలం బొమ్మలరామారంలో విషాదం అలుముకుంది. లెఫ్టినెంట్ కల్నల్ వీవీబీ రెడ్డి పూర్తి పేరు ఉప్పల వినయ్ భాను రెడ్డి. ఆయన తల్లిదండ్రులు నర్సింహా రెడ్డి, విజయలక్ష్మీ. ప్రస్తుతం వారి కుటుంబం మేడ్చల్ జిల్లా మల్కాజ్‌ గిరిలో నివాసం ఉంటోంది. ఆయన సతీమణి స్పందన కూడా ఆర్మీలో డెంటల్ డాక్టర్ గా పనిచేస్తున్నారు. వీవీబీ రెడ్డి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన సొంత వ్యవసాయ క్షేత్రంలో అంతిమ సంస్కారాలు నిర్వహించాలని వినయ్ భాను రెడ్డి కుటుంబ సభ్యులు నిర్ణయించారు.



స్వగ్రామంలో అంతిమ సంస్కారాలు పూర్తి 


అరుణాచల్ ప్రదేశ్‌ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన ల్యూటినెంట్ కల్నల్‌ ఉప్పల వినయ్ భాను రెడ్డి అంత్యక్రియలు శనివారం అధికార లాంఛనాలతో పూర్తి అయ్యాయి.  ఆయన స్వగ్రామం యాదగిరి గుట్ట జిల్లా బొమ్మలరామారానికి చేరుకున్న వీవీబీ రెడ్డి భౌతికకాయానికి మంత్రి జగదీశ్‌రెడ్డి,సైనిక అధికారులు నివాళులు అర్పించారు.  స్థానిక ఎమ్మెల్యే గొంగొడి సునీతామహేందర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, యాదాద్రి జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, కలెక్టర్ పమేలాసత్పతి, రాచకొండ కమిషనర్‌ చౌహాన్ పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు.  సైనిక వాహనంపై భౌతికకాయం ఉంచి అంతిమయాత్రను నిర్వహించారు ఆర్మీ అధికారులు. ఈ ర్యాలీలో పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుమారు మూడు కిలోమీటర్ల మేర బారులు తీరిన జనం కల్నల్ వినయ్ రెడ్డి అమర్ హై అంటూ నినాదాలు చేశారు. 






అరుణాచల్ ప్రదేశ్ లో ప్రమాదం


అరుణాచల్ ప్రదేశ్‌లో గురువారం ఉదయం జరిగిన చీతా హెలికాప్టర్ ప్రమాదంలో ఇద్దరు పైలట్‌లు మృతి చెందినట్టు ఆర్మీ అధికారులు ప్రకటించారు. ఉదయం ఈ హెలికాప్టర్ కుప్ప కూలగా అప్పటి నుంచి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూనే ఉన్నారు. ఆర్మీ చీతా హెలికాప్టర్‌ మండాలా హిల్స్ వద్ద కుప్ప కూలింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన వీవీబీ రెడ్డి అమరుడయ్యారు.