BJP Incharge Car Attack : నిజామాబాద్ జిల్లా బీజేపీ ఇన్ ఛార్జ్ మీసాల చంద్రయ్య కారుపై దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అధికార పార్టీ వారే దాడి చేశారంటూ బీజేపీ నాయకులు ఆరోపణ చేస్తుంటే...పోలీసులు విచారణలో అసలు నిజాలు వెలుగుచూశాయి. 


అసలేం జరిగిందంటే? 


ఈ నెల 10న నిజామాబాద్ జిల్లా బీజేపీ ఇన్ ఛార్జ్ మీసాల చంద్రయ్య పదాధికారుల సమావేశంలో పాల్గొని తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా డిచ్ పల్లి మండలం 
మాధవ నగర్ వద్ద చంద్రయ్య కారుపై దాడి జరిగింది. ఇన్నోవా కారు వెనుక అద్దాలు ధ్వంసమయ్యాయి. కారులో ఉన్న చంద్రయ్యకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై పోలీసులకు బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న డిచ్ పల్లి పోలీసులు పురోగతి సాధించారు. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ రాళ్ల దాడిని బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. అధికార పార్టీకి చెందిన నాయకులే ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపించారు. పోలీసుల విచారణలో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. 


కీలక నేత అనుచరుడు


బీజేపీ ఇన్ ఛార్జ్ మీసాల చంద్రయ్య కారుపై దాడికి పాల్పడ్డ నలుగురు బీజేపీకే చెందిన వారే అని పోలీసులు అనుమానిస్తున్నారు. అందులో ఒకరు బీజేపీకి చెందిన ఓ ఫైర్ బ్రాండ్ గా చెప్పుకునే కీలక నేత అనుచరుడిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై డిచ్ పల్లి పోలీసులను విషయాన్ని దాటవేస్తున్నా... అధికార పార్టీకి చెందిన నేతలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ వారే వారి మధ్య అంతర్గత కలహాలతో దాడులు చేసుకుంటూ... బీఆరెస్ మీద వేయటాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు బీఆరెస్ నాయకులు. మరోవైపు బీజేపీ నాయకులకు ఈ విషయం మింగుడు పడని అంశంగా మారింది. మొదట అధికార పార్టీ నేతలే చేశారంటూ ఆరోపణలు చేసిన వారు ఇప్పుడు సందిగ్ధంలో పడ్డారు. నిజామాబాద్ జిల్లాలోని ఆ కీలక నేత అనుచరులే... సొంత పార్టీ నేతలపై దాడులకు పాల్పడటం బీజేపీ పొలిటికల్ స్ట్రీట్ లో హాట్ టాపిక్ గా మారింది. 


చంద్రయ్య కారుపై రాళ్ల దాడి 


నిజామాబాద్ జిల్లా బీజేపీ ఇన్‌ ఛార్జ్ మీసాల చంద్రయ్య కారుపై ఈ నెల 10వ తేదీ సాయంత్రం రాళ్లదాడి జ‌రిగింది. ఈ దాడిపై అప్పట్లో ఆయన మాట్లాడుతూ దాడులకు భయపడేది లేదన్నారు. దేనికైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు.  నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా పదాధికారుల సమావేశంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సమావేశం ముగిసిన త‌ర్వాత హైదరాబాద్ వెళ్తుండగా మాధవ నగర్ సాయిబాబాగుడి దగ్గర చంద్రయ్య కారుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేయగా కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.  అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు. మాధవ్‌న‌గర్ వద్ద విలేకరులతో మాట్లాడిన చంద్రయ్య... తాను హైదరా బాద్ వెళ్తుండ‌గా మార్గ మధ్యలో కొందరు బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ త‌న కారుపై రాళ్లతో దాడి చేశారని అప్పట్లో ఆయన ఆరోపించారు. వాహనానికి ముందు భాగంలో బీజేపీ జెండా ఉండడంతోనే తనపై దాడి చేసినట్లు ఆయన చెప్పారు. అయితే పోలీసుల విచారణలో మాత్రం సొంత పార్టీకి చెందిన కార్యకర్తలే ఆయనపై దాడి చేసినట్లు తేలింది.