Sarpanches Dharna : రేపు(సోమవారం) హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నా చౌక వద్ద సర్పంచుల ధర్నా నిర్వహిస్తున్నట్లు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, రాజీవ్ పంచాయతీ రాజ్ సంఘటన్ ఛైర్మన్ సిద్ధేశ్వర్ తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ నేతలు... సర్పంచులకు పంచాయతీలకు నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో రేపు ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలీసుల అనుమతి కోరుతూ కాంగ్రెస్ పార్టీ పక్షాన లేఖ ఇచ్చామన్నారు. ధర్నా చౌక్ వద్ద ధర్నాకు అనుమతి కోరామని, అసెంబ్లీ ముట్టడికో, రాస్తారోకో కోసమో అనుమతి అడగలేదన్నారు. ధర్నా చౌక్ వద్ద అనుమతి ఇవ్వకపోయినా సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్పంచుల ధర్నా జరిగి తీరుతుందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం
" ధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ లు పెద్ద ఎత్తున తరలిరావాలి. సర్పంచుల ధర్నాను పోలీసులు అడ్డుకుంటే ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతాం. ధర్నా చౌక్ ఏర్పాటు చేసిందే ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు అక్కడ కూడా అనుమతులు ఇవ్వకపోవడం ఏమిటీ?. ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలపై అణచివేత ధోరణి అవలంభిస్తున్నాయి. పోలీసులు ధర్నాకు వెంటనే అనుమతి ఇవ్వాలి. లేకపోతే పెద్దఎత్తున పోరాటం చేసి ప్రభుత్వ మెడలు వంచుతాం. 12,750 గ్రామపంచాయతీ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఈ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడుతాం" -మల్లు రవి, సిద్దేశ్వర్
మంత్రులు వెళ్లింది విహారయాత్రకా
రైతు స్వరాజ్య వేదిక మీద పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడిన అహంకారపు మాటలను ఖండిస్తున్నామని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. రైతు బంధు సమితి అధ్యక్షుడు అయితే రైతుల సమస్యల మీద రైతు స్వరాజ్య వేదిక వాళ్లు చేస్తున్న ఆరోపణల మీద సమీక్ష చేసుకోవాలి కానీ నోటికి ఏది వస్తే అది మాట్లాడడం చూస్తుంటే రైతు బంధు సమితి అధ్యక్షుడు కాదు రైతుల రాబందు సమితి అధ్యక్షుడిగా మారారని విమర్శించారు. రాష్ట్రంలో పంట నష్టం జరగానే లేదు అని రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతుంటే ఇతన్ని ఎలా రైతు బంధు సమితికి అధ్యక్షుడ్ని చేశారో కేసీఆర్ ఆలోచన చేయాలన్నారు. 2022 ఫిబ్రవరిలో వర్షాలతో పంట నష్టపోతే వరంగల్ జిల్లాకు మంత్రులు వెళ్లింది నిజం కాదా? మీరు చెప్పుతున్నట్లు పంట నష్టం జరగకపోతే మంత్రులు విహార యాత్రకు వెళ్లినట్లా? అని ప్రశ్నించారు. 2022 జూన్ లో భారీ వర్షాలతో రాష్ట్రంలో దాదాపు 20 లక్షల ఎకరాల్లో నష్టం జరిగింది మీ కళ్లకు కనిపించటం లేదా? అని మండిపడ్డారు.
రైతు వ్యతిరేకిగా మిగిలిపోతారు
"2014 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం పంటలు నష్టం జరిగితే మీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పంటల బీమా అందలేదని కోర్టు చెప్పిన సంగతి మరచి పోయారా?. 2021 నవంబర్ నుంచి 2022 ఫిబ్రవరి వరకు కేవలం పంటల నష్టంతో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. నాలుగు సంవత్సరాలుగా రుణమాఫీ చేయకపోవడం వల్ల వడ్డీలు పెరిగి కొత్త రుణాలు దొరకక లక్షల్లో రైతులు అవస్థలు పడుతున్నారు. కేవలం పంట రుణమాఫీ చేయకపోవడం వల్లే దాదాపు 16 లక్షల మంది రైతులు డిఫాల్టర్లుగా మారి ఏ బ్యాంకులు రుణం ఇవ్వని పరిస్థితి వచ్చింది అంటే అది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వ అసమర్థత వల్లే. ఆరోపణలు చేసిన వారి మీద నోటికి ఏది వస్తే అది మాట్లాడితే కేసీఆర్ దగ్గర మెప్పు పొందగలరేమో కానీ రైతుల దృష్టిలో రైతు వ్యతిరేకిగా నిలిచిపోతారు."- అన్వేష్ రెడ్డి