DAV School Incident : అభం శుభం తెలియని చిన్నారిపై దారుణ దూరాఘతానికి పాల్పడ్డ దోషులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. బంజారాహిల్స్ లోని DAV స్కూల్ ఘటనలో బాధిత చిన్నారి తల్లిదండ్రులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లి లోని ఆయన నివాసంలో ఆదివారం కలిశారు. దోషులుగా ఉన్న డ్రైవర్ రజనీకాంత్, సహకరించిన ప్రిన్సిపాల్ మాధవిలను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని మంత్రిని కోరారు. దోషుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, తల్లిదండ్రులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇప్పటికే స్కూల్ అనుమతిని రద్దు చేసి, సీజ్ చేశామని చెప్పారు.
స్కూల్ తిరిగి ప్రారంభించాలని నిర్ణయం
డీఏవీ స్కూల్ అనుమతి రద్దుపై తల్లిదండ్రులు భేటీ అయి చర్చించారు. DAV స్కూల్ కావాలని నిర్ణయించుకున్నారు. రిప్రజంటేషన్ ఫార్మ్స్ ను కలెక్ట్ చేసుకున్న పేరెంట్స్, ఫార్మ్స్ ను సఫీల్ గూడాలో ఉన్న DAV మేనేజ్మెంట్ కు అందచేయనున్నారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్ మేనేజ్మెంట్ డీఈవోను కలిసి ఫార్మ్స్ ను అందచేయనున్నారు. నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి వ్యవహారంలో డీఏవీ పాఠశాల గుర్తింపు రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు పాఠశాలను తిరిగి ప్రారంభించాలని కేబీఆర్ పార్క్ గేట్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆదివారం సమావేశమయ్యారు. పాఠశాలను ప్రారంభించాలని కోరుతూ రాసిన లేఖలను డీఈవోకి సమర్పించాలని నిర్ణయించుకున్నారు.
700 మంది విద్యార్థుల భవిష్యత్తు
చిన్నారిపై అఘాయిత్యం అందరినీ కలచివేసిందని విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు. ఆ చిన్నారికి న్యాయం జరిగేవరకు పోరాడుతామన్నారు. అయితే స్కూల్ గుర్తింపును రద్దు చేయడంతో 700 మంది విద్యార్థుల భవిష్యత్తు రోడ్డున పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర పాఠశాలల్లో సీట్లు దొరకడం ఇబ్బందికరమని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆప్షన్స్‌లో ఫీజులు అధికంగా ఉన్నాయన్నారు. మరికొన్ని పాఠశాలల్లో స్టేట్ సిలబస్ ఉండడంతో పిల్లల చదువుకు ఇబ్బంది ఎదురవుతుందని తెలిపారు. ఈ కారణాల దృష్ట్యా ప్రభుత్వ ఆధ్వర్యంలో సిబ్బందిని నియమించి డీఏవీ స్కూల్ ను తిరిగి ప్రారంభించాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
స్కూల్ అనుమతి రద్దు
ఎల్.కె.జి స్టూడెంట్ పై లైంగిక దాడి ఘటనలో తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇటీవల డీఈవోకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పాఠశాలలో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులను ఇతర పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని మంత్రి సూచించారు. ఈ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడాలని డీఈవోను ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారి సందేహాల నివృతి చేసేందుకు తగిన వ్యవస్థను ఏర్పాటు చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. డీఏవీ పాఠశాలలో నాలుగేళ్ల చిన్నారిపై ప్రిన్సిపల్ డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు అయింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.