టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో భారత్ ఆఖరి బంతికి విజయం సాధించిన సంగతి తెలిసిందే. వన్‌డౌన్‌లో వచ్చిన ‘కింగ్’ విరాట్ కోహ్లీ (82 నాటౌట్: 53 బంతుల్లో, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను గెలిపించాడు. అయితే అక్టోబర్ విరాట్ కోహ్లీకి బాగా అచ్చొచ్చిన నెల. ముఖ్యంగా అక్టోబర్‌లో 21వ తేదీ నుంచి 24వ తేదీ మధ్య విరాట్ గతంలో కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.


ఇది 2011లో ప్రారంభం అయింది. 2011లో అక్టోబర్ 23వ తేదీన ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో విరాట్ కోహ్లీ (86 నాటౌట్: 99 బంతుల్లో, 11 ఫోర్లు) చివరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్ గెలిపించాడు. 2015లో అక్టోబర్ 22వ తేదీన దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కూడా విరాట్ కోహ్లీ (138: 140 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లు) అద్భుతమైన సెంచరీ చేశాడు. ఆ మ్యాచ్‌లో కూడా భారత్ విజయం సాధించింది.


ఆ తర్వాత 2016లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ (154 నాటౌట్: 134 బంతుల్లో, 16 ఫోర్లు, ఒక సిక్సర్) మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఛేజింగ్‌లో అద్భుతమైన సెంచరీతో మ్యాచ్‌ను గెలిపించాడు. 2017లో కూడా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో విరాట్ (121: 125 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు) శతకం సాధించాడు. అయితే ఆ మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది.


ఇక 2018లో విరాట్ ఆట నెక్స్ట్ లెవల్. అక్టోబర్ 21వ తేదీ, 24వ తేదీల్లో వెస్టిండీస్‌తో జరిగిన రెండు వన్డేల్లో రెండు శతకాలు సాధించాడు. మొదటి వన్డేల్లో 107 బంతుల్లో 21 ఫోర్లు, రెండు సిక్సర్లతో 140 పరుగులు చేశాడు. రెండో వన్డేలో మరో భారీ సెంచరీ చేశాడు. 129 బంతుల్లో 13 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 157 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు.


2021 టీ20 వరల్డ్ కప్‌లో అక్టోబర్ 24వ తేదీన జరిగిన మ్యాచ్‌లో కూడా విరాట్ కోహ్లీ (57: 49 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే ఆ మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. వచ్చే సంవత్సరం ఇదే సమయంలో వన్డే ప్రపంచకప్ జరగనుంది. కాబట్టి ఈ తేదీల్లో భారత్‌కు మ్యాచ్ ఉంటే విరాట్ నుంచి మంచి ఇన్నింగ్స్ ఆశించవచ్చు.