IND vs PAK, T20 World Cup 2022: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2022 తొలి సూపర్‌ 12 మ్యాచులో టీమ్‌ఇండియా అద్భుతంగా ఆడుతోంది. ఓవర్‌కాస్టింగ్‌ కండిషన్స్‌ను ఫర్‌ఫెక్ట్‌గా ఉపయోగించుకుంది. దాయాది పాకిస్థాన్‌ను పేస్‌, స్వింగ్‌, షార్ట్‌పిచ్‌ బంతులతో ఇబ్బంది పెట్టింది. 20 ఓవర్లకు 150 పరుగులకే పరిమితం చేసింది. ఇఫ్తికార్‌ అహ్మద్‌ (51; 34 బంతుల్లో 2x4, 4x6), షాన్‌ మసూద్‌ (52*; 42 బంతుల్లో 5x4, 0x6) హాఫ్ సెంచరీలతో ఆదుకున్నారు. అర్షదీప్‌ సింగ్‌ (3/32), హార్దిక్‌ పాండ్య (3/30) ప్రత్యర్థిని దెబ్బకొట్టారు.




హార్దిక్‌, అర్షదీప్‌ అదుర్స్‌!


టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు శుభారంభం దక్కలేదు. ఆకాశం మేఘావృతమై ఉండటం, చల్లని గాలి వీస్తుండటం, గాల్లో తేమ ఎక్కువగా ఉండటంతో టీమ్‌ఇండియా పేసర్లు రెచ్చిపోయారు. తొలి ఓవర్లోనే భువనేశ్వర్‌ కుమార్‌ బంతిని రెండువైపులా స్వింగ్‌ చేసి రిజ్వాన్‌ను ఇబ్బంది పెట్టాడు. రెండో ఓవర్లో వేసిన తొలి బంతికే బాబర్‌ ఆజామ్‌ (0)ను అర్షదీప్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. గోల్డెన్‌ డక్‌గా వెనక్కి పంపించాడు. అప్పటికి స్కోరు ఒకటి. మరికాసేపటికే రిజ్వాన్‌ (4)నూ అతడే ఔట్‌ చేశాడు.




నిలబెట్టిన అహ్మద్‌, మసూద్‌


ఒత్తిడిలోకి వెళ్లిన పాక్‌ను ఇఫ్తికార్‌ అహ్మద్‌, షాన్‌ మసూద్‌ ఆదుకున్నారు. పేసర్లను ఆచితూచి ఆడారు. అక్షర్‌ పటేల్‌ రాగానే భారీ సిక్సర్లతో రెచ్చిపోయారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 50 బంతుల్లో 76 పరుగుల భాగస్వామ్యం అందించాడు. 91 వద్ద అహ్మద్‌ను షమి ఔట్‌ చేసి బ్రేకిచ్చాడు. ఆ తర్వాత హార్దిక్‌ పాండ్య వరుసగా షాదాబ్‌ ఖాన్‌ (5), హైదర్‌ అలీ (2), మహ్మద్‌ నవాజ్‌ (9)ను ఔట్‌ చేసి ఒత్తిడి పెంచాడు. చివర్లో మసూద్‌, బౌండరీలు బాది హాఫ్‌ సెంచరీ సాధించాడు. షాహిన్‌ అఫ్రిది (16; 8 బంతుల్లో 1x4, 1x6) మెరుపు షాట్లు ఆడి స్కోరును 159/8కి చేర్చాడు.