George Dockrell Covid Positive: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది! కరోనా సోకినప్పటికీ ఐర్లాండ్‌ క్రికెటర్‌ జార్జ్‌ డాక్రెల్‌ నేడు శ్రీలంకతో మ్యాచ్‌ ఆడుతున్నాడు. కొవిడ్‌-19 ఉన్నప్పటికీ ప్రపంచకప్‌ ఆడుతున్న తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. మారిన నిబంధనల వల్లే అతడు మ్యాచ్‌ ఆడాడు.


కరోనా వైరస్‌ ప్రపంచాన్ని కకావికలం చేసింది. క్రీడారంగాన్ని కుదేలు చేసింది. ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. మహమ్మారి కారణంగా 2020లో అంతర్జాతీయ క్రికెట్‌ స్తంభించింది. ఇంగ్లాండ్‌లో వెస్టిండీస్‌ పర్యటన బయో బుడగలో జరిగేంత వరకు ఎలాంటి సిరీసులు లేవు. ఇందుకోసం ఆటగాళ్లు ముందుగా వచ్చి 15 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చేది. ఇదే తరహాలో కఠిన నిబంధనల నడుమ యూఏఈలో భారత్‌ ఐపీఎల్‌ నిర్వహించింది. క్రికెటర్లు బయటకు వెళ్లేవారు కాదు. ఆ తర్వాత మరికొన్ని నియమాలను సవరించారు.


2021లో పరిస్థితి మరికొంత మారింది. జట్ల ఆటగాళ్లు కలిసేవారు. కలిసి భోజనం చేసేవారు. వ్యాక్సినేషన్‌ పూర్తవ్వడం, కొవిడ్‌ తీవ్రత తగ్గడంతో పరిస్థితులు మారాయి. కొన్ని రోజుల క్రితం ఆస్ట్రేలియా ఎవరికీ తెలియకుండా, గుట్టుచప్పుడు కాకుండా కొవిడ్‌ వచ్చిన ఆటగాడిని ఆడించింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2022లో నియమాలను పూర్తిగా సవరించారు. కరోనా వైరస్‌ సోకినప్పటికీ మ్యాచులు ఆడేందుకు అనుమతించారు. అందుకే జార్జ్‌ డాక్రెల్‌ ఆదివారం శ్రీలంకతో మ్యాచ్‌ ఆడాడు.


'టెస్టులో కొవిడ్‌ పాజిటివ్‌ రావడం డాక్రెల్‌ ఆడటం, సాధన చేయడాన్ని అడ్డుకోలేదు. మిగతా జట్టును సురక్షితంగా ఉంచేందుకు సాధన చేసేటప్పుడు, మ్యాచ్‌ ఆడేటప్పుడు అతడు వేరుగా ప్రయాణిస్తాడు. ప్రస్తుతం అతడికి స్వల్ప లక్షణాలే ఉన్నాయి. కాకపోతే అతడి కదలికలను నిర్వాహకులు ట్రాక్‌ చేస్తారు. ఎవరినీ కలవనివ్వరు' అని క్రికెట్‌ ఐర్లాండ్‌ తెలిపింది.


శ్రీలంకతో జరిగిన మ్యాచులో ఐర్లాండ్‌ ఓటమి చవిచూసింది. హోబర్ట్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. స్టిర్లింగ్‌ (34), హ్యారీ టెక్టార్‌ (45) టాప్‌ స్కోరర్లు. కొవిడ్‌ సోకిన డాక్రెల్‌ 14 పరుగులు సాధించాడు. ఇక ఛేదనలో లంకేయులు అదరగొట్టారు. కేవలం 15 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. ఓపెనర్‌ కుశాల్‌ మెండిస్ (68) అజేయ హాఫ్ సెంచరీ చేశాడు. ధనంజయ డిసిల్వా (31), చరిత్‌ అసలంక (31*) మెరిశారు.