Palvai Sravanthi : మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కాన్వాయ్ పై దాడి జరిగింది. నాంపల్లి మండలంలో ప్రచారానికి వెళ్తోన్న ఆమె కాన్వాయ్ కి సైడ్ ఇవ్వకుండా వెళ్తుండటంతో  వివాదం రాజుకుంది. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు ఒకరినొకరు తిట్టుకుంటూ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పాల్వాయి స్రవంతి జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని పాల్వాయి స్రవంతి డిమాండ్ చేశారు. నాంపల్లి అంబేడ్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి, ఎమ్మెల్యే సీతక్క, ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. 


దారి పొడవునా అడ్డుకున్నారు-పాల్వాయి స్రవంతి 


"మా వాహనాన్ని బీజేపీ నేతల వాహనం దారిపొడవునా అడ్డుకున్నారు. హారన్ కొట్టి సైడ్ ఇవ్వమని కోరినా ఇవ్వకుండా మా వాహనానికి అడ్డంగా పెట్టారు. నాంపల్లి వద్ద ఆ కారును దాటి ముందుకు వచ్చి వారిని ప్రశ్నిస్తే ఆ కారులో ఉన్న బీజేపీ గూండాలు కారు దిగి దుర్భాషలాడుతూ మా కార్యకర్తలపై దాడి చేశారు. మా గన్ మెన్ , ఫొటో గ్రాఫర్, ఒక మహిళపై దాడికి యత్నించారు. ఈ విషయంపై పీఎస్ లో ఫిర్యాదు చేశాం. అయినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోనందుకు నిరసనగా ధర్నా చేస్తున్నాం. బీజేపీ నేతలు భౌతికదాడులకు పాల్పడి భయాందోళనకు గురిచేయాలని ప్రయత్నిస్తుంది. జిల్లా బీజేపీ అధ్యక్షుడి భార్య ఆ కారులో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక మహిళ ఉన్నా కూడా బీజేపీ నేతలు దాడులకు పాల్పడ్డారు. బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది. అందుకు నిరసనగా అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగాం. రాజ్యాంగాన్ని పరిష్కరించాలి, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాం." - పాల్వాయి స్రవంతి 






ఇదేనా రామరాజ్యం 


"మునుగోడు బిడ్డ పాల్వాయి స్రవంతిని గెలిపించాలని ఇక్కడి ప్రజలు ఉత్సాహంతో ఉన్నాయి. ఎన్ని స్కార్పియోలు, బైకులు, వాహనాలు కొనిచ్చినా, ఎన్ని కోట్లు పెట్టినా తాము గెలిచే పరిస్థితి లేదని రాజగోపాల్ రెడ్డి గూండాలను తీసుకొచ్చి నాంపల్లి మండలంలో ప్రచారానికి రాకుండా అడ్డుకున్నారు. వాహనాలను అడ్డుకుని దాడులకు పాల్పడ్డారు. పాల్వాయి స్రవంతికి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక దాడులకు పాల్పడుతున్నారు. రాజగోపాల్ రెడ్డి వేల కోట్లకు అమ్ముడు పోయి మునుగోడు ఉపఎన్నిక తెచ్చారు. నిందితులపై కేసు పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తు్న్నాం. రాజగోపాల్ రెడ్డి రౌడీయిజాన్ని పెంచి పోషిస్తున్నాడు. అలాంటి వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హతలేదు. ఈసీ రాజగోపాల్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. గూండాయిజం చేస్తే మునుగోడు ప్రజలు తరిమి తరిమికొడతారు. బండి సంజయ్, మోదీ, అమిత్ షా పైకి రామరాజ్యం అంటారు. తెచ్చేది గూండారాజ్యం. దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ఎన్నో ప్రభుత్వాలను కూల్చేశారు. ఇదేనా రామరాజ్యం. రాముడు రాజ్యాన్ని నిర్మించాడు కానీ కూల్చలేదు." ఎమ్మెల్యే సీతక్క  


బీజేపీ ఓటమికి సంకేతం 


పాల్వాయి స్రవంతి కాన్వాయ్ పై దాడిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖండించారు. ఆడబిడ్డపై దాడి చేసి మునుగోడులో గెలవాలనుకోవడం చేతగానితనమన్నారు. పాల్వాయి స్రవంతి పై దాడి బీజేపీ ఓటమికి సంకేతమన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని పోటీ నుండి బహిష్కరించాలని ఈసీని డిమాండ్ చేశారు.