Viral Video:
నీళ్లలో దూకి కాపాడిన కుక్క..
మనుషుల్లోనైనా, జంతువుల్లోనైనా "అమ్మతనం" అంతా ఒక్కటే. బిడ్డ కష్టాల్లో ఉంటే...అమ్మ ఎంతగా కదిలిపోతుందో మనకు తెలియంది కాదు. బిడ్డ కష్టం తీర్చేందుకు ఎంత సాహసమైనా చేస్తుంది. ప్రాణాలకూ తెగిస్తుంది. బిహార్‌లోని సివాన్ (Siwan)లోనూ ఓ కుక్క ఇదే విషయాన్ని
మరోసారి నిరూపించింది. ఎంతో ధైర్యం చేసి తన బిడ్డను కాపాడుకుంది. సివాన్ సిటీలోని మహదేవ నాయి బస్తీలో ఓ కాలువలో కుక్క పిల్ల పడిపోయింది. బయటకు వచ్చే దారి తెలియక గజగజ వణికిపోతూ అందులోనే ఉండిపోయింది. బయటకు వచ్చేందుకు ప్రయత్నించినా అది వర్కౌట్ అవలేదు. ఇది చూసిన తల్లి కుక్క వెంటనే నీళ్లలోకి దూకింది. మునిగిపోకుండా చాలా జాగ్రత్తగా కుక్క పిల్లను పంటికి కరుచుకుంది. చాలాసేపు ప్రయత్నించి ఎలాగోలా పట్టు దక్కించుకుంది. మెల్లగా ముందుకు కదిలింది. నీళ్లలో నుంచి బయటకు వచ్చేంత వరకూ తన బిడ్డను అలా పళ్లతో గట్టిగా పట్టుకుంది తల్లి కుక్క. గట్టిగా ప్రయత్నించి చివరకు సురక్షితంగా బయటకు తీసుకురాగలిగింది. బయటకు వచ్చినా అది వెంటనే అక్కడే ఆగిపోలేదు. మిగతా పిల్లల వద్దకు చేర్చాలని ఆరాట పడింది. మధ్యలో అడ్డంకులు వచ్చినా వాటిని దాటుకుంటూ...తన పిల్లల వద్దకు ఈ కుక్కనీ తీసుకెళ్లి వదిలింది. అప్పుడు కానీ అది రిలాక్స్ అవలేదు. ఇటీవల కురిసిన వర్షాలతో అక్కడ కాలువలు పొంగి పొర్లుతున్నాయి. ఎక్కడ చూసినా నీళ్లే కనబడుతున్నాయి. పొరపాటున అందులో తన బిడ్డ పడిపోయిందని గుర్తించి...సాహసం చేసి మరీ కాపాడుకుంది తల్లి కుక్క. ఈ వీడియోని ట్విటర్‌లో పోస్ట్ చేయగా...వెంటనే వైరల్ అయిపోయింది.