Iran Protests:


అమెరికాలో ఆందోళనలు..


ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా అమెరికా ఇరాన్‌కు సపోర్ట్ ఇస్తోంది. యూఎస్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు ఇప్పటికే ఇరాన్ మహిళలకు మద్దతు తెలుపుతూ లేఖ విడుదల చేశారు. ఇప్పుడు అమెరికాలోని పౌరులు కూడా వారికి అండగా నిలుస్తున్నారు. లాస్ ఏంజిల్స్, వాషింగ్టన్ డీసీలో వేలాది మంది రోడ్లపైకి వచ్చి
ఇరాన్ మహిళలకు మద్దతుగా నిలిచారు. AP న్యూస్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం...అన్ని వయసుల వాళ్లు రోడ్లపైకి వచ్చి ఇరాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూఎస్ నేషనల్ మాల్ (US National Mall) వద్ద ఇరాన్‌ దేశ జెండాను పట్టుకుని నిరసన తెలిపారు. "మేమంతా ఒక్కటవుతున్నాం. ఇక మీరు భయపడాల్సిందే" అంటూ ఇరాన్‌ను హెచ్చరిస్తూ నినాదాలు చేశారు. హిజాబ్‌పై పోరాడి పోలీస్‌ల కస్టడీలో మృతి చెందిన మహసా పేరునీ గట్టిగా పలుకుతూ నినదించారు. కొన్ని సంస్థలు ప్రత్యేక చొరవ చూపించి ఇలా ప్రజల్ని ఒక్కతాటిపైకి తీసుకొచ్చారు. కొందరు ఈ నిరసనల్లో పాల్గొనేందుకు టొరంటో నుంచి వచ్చారు. "Help Free Iran" అనే నినాదాలున్న టిషర్ట్‌లు వేసుకున్నారు కొందరు యువతులు. "మానవ హక్కుల్ని, స్వేచ్ఛను హరించే పాలకులు మాకు అవసరం లేదు" అని తేల్చి చెప్పారు. కొందరు ఇరాన్‌కు వ్యతిరేకంగా పాటలు కూడా పాడారు. "We want freedom" అంటూ గొంతెత్తారు. 


బెర్లిన్‌లోనూ నిరసనలు...


బెర్లిన్‌లో వేలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. Woman Life Freedom Collective స్వచ్ఛంద సంస్థ ఈ ఆందోళనలకు నేతృత్వం వహించింది. "ఇరాన్‌లో వీధుల్లో దారుణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి కోసం మనం పోరాటం చేయాల్సిందే. ఇది నిరసన కాదు. ఇదో ఉద్యమం. ప్రపంచ దేశాల ప్రజలందరూ ఈ ఉద్యమాన్ని చూడాలి" అని ఆందోళనకారులు చెబుతున్నారు. 


సోషల్ మీడియాలోనూ మద్దతు..


సోషల్ మీడియాలోనూ ఇరాన్ మహిళలకు మద్దతు లభిస్తోంది. పలువురు ప్రముఖులు కూడా దీనిపై స్పందించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పాటు ఆమె సతీమణి మిషెల్లే కూడా దీనిపై మాట్లాడారు. ఇరానియన్ మహిళలకు వాళ్లకు మద్దతుగా నిలబడ్డారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా...సోషల్ మీడియా వేదికగా ఓ స్టేట్‌మెంట్‌ కూడా విడుదల చేశారు. "ఈ అంతర్జాతీయ బాలికా దినోత్సంవ సందర్భంగా...ఇరానియన్ మహిళలకు మేము అండగా నిలబడ తామని మాటిస్తున్నాం. ఈ ఆందోళనలతో మహిళలందరికీ స్ఫూర్తినిస్తున్న వారికీ మా మద్దతు ఉంటుంది" అని వెల్లడించారు. "వాళ్లు అడిగే హక్కులు ఆమోదయోగ్యమైనవి. సమానత్వం, తమకు తాముగా స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవటం, తమ గుర్తింపు కోసం పోరాడటం, ఎలాంటి వేధింపులు, హింస ఎదుర్కోకుండా బతకాలనుకోవటం. ఇవే వాళ్లు అడిగేది" అని ఆ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు బరాక్ ఒబామా, మిషెల్లే. "చేదు గతాన్ని మర్చిపోయి తమ భవిష్యత్‌ అందంగా ఉండాలని పోరాడుతున్న ఇరానియన్ మహిళలను చూస్తుంటే గర్వంగా ఉంది. త్వరలోనే వాళ్లు తమ హక్కుల్నిపోరాడి సాధించుకుంటారని ఆశిస్తున్నాం" అని అన్నారు. 


Also Read: Rahul Gandhi Diwali Holidays: భారత్‌ జోడో యాత్రకు బ్రేక్ - దీపావళి విరామంతో ఢిల్లీ వెళ్లిన రాహుల్ గాంధీ