సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పంథాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. వైరస్ మ్యుటేషన్లు చెంది కొత్త రూపాంతరం చెందుతున్నట్లుగా సైబర్ నేరగాళ్ల తీరు ఉంటోంది. ఇప్పటికే ఆడవాళ్ల ప్రొఫైల్ ఫొటోలతో ముగ్గులోకి దింపడం.. అందినంత డబ్బు వసూలు చేసిన ఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ నేతలు, సెలబ్రిటీల ఫొటోలతోనూ మోసాలకు పాల్పడిన పరిస్థితులు కూడా గతంలో తెరపైకి వచ్చాయి. అన్ని రంగాల వారినీ సైబర్ నేరగాళ్లు వదలడం లేదు. తాజాగా సైబర్ నేరగాళ్లను ఆట కట్టించే పోలీసులను కూడా వదల్లేదు. ఏకంగా రాష్ట్రానికి పోలీస్ బాస్ అయిన డీజీపీ మహేందర్ రెడ్డి ఫొటోతో సోషల్ మీడియాలో కొందరు మోసాలకు పాల్పడ్డారు.


తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఫొటోను సోషల్ మీడియాలో ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకుని పలువురు మోసాలకు పాల్పడ్డారు. వీరిపై చర్యలు తీసుకోవాలని ఓ వ్యక్తి ట్విట్టర్ ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సుమోటోగా కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


పలు సోషల్ మీడియా ఖాతాలు క్రియేట్ చేసిన కొందరు విదేశీయులు ప్రముఖుల ఫొటోలతో అమాయకులకి ఎర వేసి ముగ్గులోకి దింపుతున్న సంగతి తెలిసిందే. వర్క్ ఫ్రం హోం, జాబ్స్, గిఫ్ట్‌లు అంటూ ఆశ చూపి ముగ్గులోకి దింపుతున్నారు. ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్న నైజీరియాకు చెందిన వ్యక్తి ఫిడెలిస్ ఒబిన్‌, అతనికి సహకరిస్తున్న బిహార్‌కు చెందిన మరో వ్యక్తి అనిల్‌ కుమార్ పాండేని సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. వారి నుంచి నాలుగు సెల్‌ఫోన్లు, వివిధ బ్యాంకులకు చెందిన 13 చెక్ బుక్స్, ఏకంగా 65 ఏటీఎం కార్డులు, 17 స్వైపింగ్ మెషన్లు, నైజీరియాకు చెందిన పాస్‌పోర్ట్‌, 30 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.12 లక్షల లావాదేవీలను పోలీసులు నిలిపేవేశారు.


అయితే, పోలీసులు వీరు ఎక్కడి నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారనే అంశంపై విచారణ మొదలుపెట్టారు. ఇంకా వీరి ముఠాపై కూడా పోలీసులు నిఘాపెట్టి, వీరి వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆన్‌లైన్‌లో అపరిచిత వ్యక్తులను నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో పోలీసులు కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఫేస్‌బుక్‌‌లో ఛాటింగ్‌లు చేయడం వల్ల, ఎవరూ ఉద్యోగాలు ఇవ్వరని, గిఫ్ట్‌లు అంటూ చెప్పినా.. అమాయకంగా వారిని నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 


గిఫ్టులు, లాటరీ ద్వారా భారీ మొత్తం డబ్బులు వచ్చాయని ఫోన్లలో ఎవరైనా ఆశచూపితే కచ్చితంగా వాటికి దూరంగా ఉండాలని పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్నా కొందరు వాటికి ఆకర్షితులై మోసపోతున్నారు. ఇలాంటి కాల్స్ కనుక వస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. తమ పిల్లల సోషల్‌ మీడియా వాడకాన్ని కూడా తల్లిదండ్రులు పర్యవేక్షించాలని పోలీసులు సూచించారు. సైబర్‌ నేరగాళ్లు సరికొత్త దారుల్లో మోసాలకు పాల్పడుతున్నారని, వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని పదే పదే హెచ్చరిస్తున్నారు.