దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తుంది. కరోనా కొత్త కేసులు, మరణాల్లో స్వల్పహెచ్చుతగ్గులు కనిపిస్తున్నా, కొన్ని రాష్ట్రాల్లో కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 17,76,315 మందికి కొవిడ్19 నిర్ధారణ పరీక్షలు చేయగా 41,649 పాజిటివ్ కేసులు వచ్చాయి. శుక్రవారం మరో 593 మంది కరోనాతో మరణించారు. దేశంలో మొత్తం కరోనా కేసులు 3.16 కోట్లకు చేరుకోగా 4.23 లక్షల మంది మహమ్మారికి బలయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా ప్రకటించింది.
ఇటీవల నాలుగు లక్షల దిగువకు వచ్చిన క్రియాశీల కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం 4,08,920 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. ఈ క్రియాశీల రేటు ప్రస్తుతం 1.29 శాతంగా ఉంది. రికవరీ రేటు 97.37 శాతానికి చేరింది. శుక్రవారం ఒక్కరోజు 37 వేల మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.07 కోట్లకు చేరుకోగా.. నిన్న 52,99,036 మంది కరోనా టీకాలు తీసుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసులు సంఖ్య 46 కోట్ల మార్కును దాటినట్లు కేంద్రం తెలిపింది.
కరోనా మహమ్మారి విజృంభణ దేశంలో ఇంకా కొనసాగుతూనే ఉంది. కరోనా సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టినా... గత కొన్ని రోజుల నుంచి ప్రతిరోజూ 40 వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో ఆందోళన నెలకొంది. గురువారంతో పోలిస్తే శుక్రవారం కేసుల సంఖ్య కొంచెం తగ్గినప్పటికీ మరణాల సంఖ్య మాత్రం భారీగా పెరిగింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 41,649 కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారంతో పోల్చుకుంటే గత 24 గంటల్లో 38 మరణాలు అధికంగా నమోదయ్యాయి. దాదాపుగా రెండున్నర వేల కేసులు తగ్గాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం దేశంలో మొత్తంలో కరోనా కేసుల సంఖ్య 3,16,13,993కి పెరగగా, మరణాల సంఖ్య 4,23,810 కి చేరింది.
కేరళలో 20 వేల కేసులు.. కర్ణాటక, మహారాష్ట్రలో వైరస్ భయాలు
కేరళలో మరోసారి 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో మొత్తం కేసులు 33.70 లక్షలకు చేరుకున్నాయి. కేసుల ఉద్ధృతితో వారాంతపు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు కేరళ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఆంక్షలు ఈ రోజునుంచి అమల్లోకి రానున్నాయి. తాజాగా మహారాష్ట్రలో 6,600 మందికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. మొత్తం కేసుల్లో ఈ రెండు రాష్ట్రాల వాటా సగానికి పైగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఒక్కసారిగా కరోనా కేసులు పెరగడం, సరిహద్దు రాష్ట్రాలు కేరళ, మహరాష్ట్రలో వైరస్ విజృంభణతో కర్ణాటకలోనూ వైరస్ భయాలు పెరుగుతున్నాయి. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేసింది. ఆ రాష్ట్రానికి వచ్చేవారికి ఆర్టీపీసీఆర్ రిపోర్టు తప్పనిసరి చేసింది.