దేశంలో న్యాయాధికారులు, న్యాయవాదులపై దాడులు జరుగుతుండడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంఘటనలపై సుమోటోగా విచారణ జరపాలని నిర్ణయించింది. వీరికి రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న రక్షణపై ఆరా తీయనుంది. ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి ఉత్తం ఆనంద్ హత్య సంఘటన అనంతర పరిస్థితులను పరిశీలించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.
ఈ దుర్ఘటనపై ఇప్పటికే ఝార్ఖండ్ హైకోర్టు విచారణ జరుపుతున్నప్పటికీ, పలుచోట్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్న దృష్ట్యా సుమోటోగా విచారణకు స్వీకరించింది. హైకోర్టు చేస్తున్న దర్యాప్తులో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.
ఈ దుర్ఘటన పర్యవసానాలను విస్తృతంగా ఉన్నాయని తెలిపింది. "సంఘటన జరిగిన తీరు; కోర్టు లోపల, వెలుపలా న్యాయాధికారుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు తదితర విషయాలన్నింటినీ పరిశీలించాల్సి ఉంటుంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు ఇవ్వడాన్ని పరిశీలిస్తాం. 'కోర్టులకు పునః భద్రత, న్యాయాధికారులకు రక్షణ (ధన్‌బాద్ అదనపు సెషన్స్ జడ్జి మృతి)' అన్న శీర్షికతో ఈ కేసును విచారిస్తాం" అని తెలిపింది. తదుపరి విచారణను ఆగస్టు 6వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.
న్యాయమూర్తి హత్య..
ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో అదనపు సెషన్స్, జిల్లా కోర్టు జడ్జి జస్టిస్ ఉత్తమ్ ఆనంద్‌ను బుధవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు ఆటోతో ఢీకొట్టి చంపేశారు. తొలుత ఈ ఘటనను పోలీసులు ప్రమాదంగా భావించగా.. సీసీటీవీ రికార్డులను పరిశీలించగా.. హత్య విషయం వెలుగులోకి వచ్చింది.
నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని బార్ అసోసియేషన్ సుప్రీం కోర్టుకు తెలిపింది. తెలివిగా రోడ్డు యాక్సిడెంట్ లో చిత్రికంచినప్పటికీ సీసీటీవీలో రికార్డవడం వల్ల ఈ హత్య వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది.