తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నమ్మకాలు ఎక్కువని అందరికీ తెలుసు. ఆయనకు లక్కీ నెంబర్ ఉంది.. లక్కీ కలర్ కూడా ఉంది. అయితే అన్ లక్కీ నెంబర్ ఉందో లేదో తెలియదు కానీ.. అన్ లక్కీ కలర్ మాత్రం ఉందట. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. నల్ల రంగు అంటే.. అసలు తనకు నచ్చదే నచ్చదని ప్రకటించారు.  మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డితో పాటు హుజూరాబాద్‌కు చెందిన దాదాపుగా 30 మంది నేతలు టీఆర్ఎస్‌లో చేరేందుకు హైదరాబాద్ వచ్చారు. వారికి కండువా కప్పేందుకు తెలంగాణ భవన్‌కు వచ్చిన కేసీఆర్... చేరికల కార్యక్రమంలో తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ధి.. సంక్షేమం.. రాజకీయ పార్టీలు వంటి వాటిపై ఎప్పుడూ మాట్లాడే రీతిలో మాట్లాడినా.. ఆయన ఈ సారి మాత్రం కొత్త విషయం  బయట పెట్టారు. అదే నల్ల రంగు నచ్చకపోవడం. 


తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో కేసీఆర్ కాన్వాయ్ నల్లరంగులో ఉండేది. అది ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు వాడింది. అదే ఆయన ఉపయోగించుకుంటూ వచ్చారు. అయితే హఠాత్తుగా కొన్ని రోజులకు తెలుపు రంగులోకి మారిపోయింది. అప్పుడే.. కేసీఆర్ కొత్త కాన్వాయ్ కొన్నారన్న ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఎవరికీ స్పష్టత లేదు. కొత్త కాన్వా‌య్ కొన్నట్లుగా ఎలాంటి జీవోలు విడుదల కాలేదు. దీంతో అన్నీ రూమర్స్ గానే ఉండిపోయాయి. ఇప్పుడు.. నలుపుర రంగు నచ్చదు అనే విషయం చెప్పడానికి... ఆ కాన్వాయ్ గురించిన విశేషాలు.. సీక్రెట్లను కూడా బయట పెట్టారు. ఆ నల్ల రంగు కాన్వాయ్‌ను ఎక్సైంజ్ ఆఫర్‌లో ఇచ్చేసి... తెల్ల రంగుకాన్వాయ్‌ని తీసుకున్నారట. ఈ విషయం తెలిసిన గవర్నర్ నరసింహన్.. ఎందుకు ఎక్స్‌ఛేంజ్ చేసుకోవడం.. కొత్త కాన్వాయ్ తీసుకోవచ్చు కదా అని సలహా ఇచ్చారని..కానీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. 


కేసీఆర్‌కు నలుపు రంగుపై అయిష్టత అన్న విషయం పార్టీ సీనియర్ నేతలకు బాగా తెలుసు. అందుకే వారు ఎప్పుడూ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కానీ ఇతర విషయాల్లో కానీ నలుగు రంగు వాడకం లేకుండా చూసుకుంటారు. నిజానికి నలుపు రంగు అంటే.. ఓ రకమైన వ్యతిరేక భావం.. ఎక్కువ జనాల్లో ఉంటుంది. స్వచ్చత అంటే తెలుపని..  నలుపు అంటే అశుభమని అనుకుంటారు. సీఎం కేసీఆర్ కూడా అందుకు భిన్నం కాదని తెలుస్తోంది. ఆయన మాటల్లోనే ఈ విషయం వెల్లడయింది. ఆయన నమ్మకాలు.. వాస్తు అంశాలపై ఇప్పటికే రకరకాల చర్చలు ...  జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు వాటి జాబితాలో నల్ల రంగు చేరింది.