ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా పాత్ర చాలా కీలకమైనది. దీని వల్ల మంచి ఎంత ఉందో.. చెడు కూడా అంతే ఉంది. స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా యాప్‌లను సరైన రీతిలో ఉపయోగించకపోతే సైబర్ నేరగాళ్ల బారిన పడే ప్రమాదం కూడా ఉంది.
కరోనా మహమ్మారి వల్ల విద్యార్థులంతా ఆన్‌లైన్ క్లాసులకు హాజరవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో 13 ఏళ్లు నిండని పిల్లలకు కూడా తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్లను కొనిస్తున్నారు. సాధారణంగా 15 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా అనుభవం తక్కువ ఉంటుంది. దీంతో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకునే ప్రమాదం ఉంది.
ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో పిల్లల భద్రత కోసం ఫేస్‌బుక్ సంస్థకు చెందిన ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ ఎన్నో సేఫ్టీ ఫీచర్లను ఏర్పాటు చేసింది. ఈ ఫీచర్ల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తే కొంత వరకైనా నేరాలకు చెక్ పెట్టవచ్చనే ఉద్దేశంతో పేరెంట్ గైడ్‌ని రూపొందించింది. వీటి గురించి పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున కృషి చేస్తోంది.
ప్రపంచ దేశాల్లో స్థానిక భాషకు తగినట్లుగా గైడ్ లైన్స్ అందిస్తోంది. తాజాగా ఇన్‌స్టా సేఫ్టీ ఫీచర్ల వివరాలను తెలుగులోనూ అందించనున్నట్లు ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్‌ను సురక్షితంగా ఉపయోగించే మార్గాలతో పాటు పలు మార్గదర్శకాలను ఇందులో సూచించింది. మారుతోన్న డిజిటల్ ల్యాండ్ స్కేప్ గురించి తల్లిదండ్రులకు మెరుగైన అవగాహన కల్పించడానికి ఈ గైడ్ ఉపయోగపడుతుందని ఇన్‌స్టా పేర్కొంది. పిల్లలు ఇన్‌స్టాగ్రామ్‌ను సురక్షితంగా ఎలా ఉపయోగించగలరనే సమాచారాన్ని ఇది అందిస్తుందని తెలిపింది. పిల్లల భద్రతకు తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది.
టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆధారిత పరికరాలు, ప్లాట్ ఫామ్స్‌ను నిషేధించడం కంటే, వాటి వాడకాన్ని సమతుల్యం చేస్తూ సురక్షితమైన వాతావరణాన్ని ఏర్పరచడం ప్రయోజనకరంగా ఉంటుందని ఇన్‌స్టా పేర్కొంది. పిల్లల ఇష్టాలను అర్థం చేసుకుని పాజిటివ్‌గా ప్రతిస్పందించడం వల్ల, తల్లిదండ్రుల మీద నమ్మకం పెరుగుతుందని.. ఫలితంగా చిన్నారి ఆన్‌లైన్ యాక్టివిటీలలో భాగం అయ్యే అవకాశం కలుగుతుందని చెప్పింది. పిల్లలు తన ఆన్‌లైన్ యాక్టివిటీలను పంచుకోవడం మొదలుపెట్టాక, సురక్షితంగా ఉండటం గురించిన చిట్కాలను వారికి సూచించాలని ఇన్‌స్టా తన గైడ్ లైన్స్‌లో వివరించింది.
పిల్లల హక్కులు, భద్రత వంటి అంశాలపై పనిచేసే సంస్థల నుంచి ఇన్‌పుట్స్ తీసుకుంది. సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్, సైబర్ పీస్ ఫౌండేషన్, ఆరంభ్ ఇండియా ఇనిషియేటివ్, యంగ్ లీడర్స్ ఫర్ యాక్టివిటీ సిటిజన్‌షిప్, ఇట్స్ ఓకే టు టాక్ మరియు సూసైడ్ ప్రివెన్షన్ ఇండియా ఫౌండేషన్ వంటి సంస్థలు ఇన్‌పుట్‌లను ఇచ్చిన వాటిలో ఉన్నాయి. వీటన్నిటినీ గైడ్‌లో పొందుపరిచింది.
ఇన్‌స్టాగ్రామ్ అంటే ఏమిటి? ప్రైవసీ సెట్టింగ్స్, ఇంటరాక్షన్లను మేనేజ్ చేయడం, టైమ్ ను మేనేజ్ చేయడం, అకౌంట్ సెక్యూరిటీ, సలహాలు, సూచనలతో పాటు కొన్ని పదాలు వాటి అర్థాలు, రిసోర్స్‌ల సమాచారాన్ని ఇందులో అందించింది.