Janareddy : తెలంగాణ కాంగ్రెస్ లో కమిటీల సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఏఐసీసీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ను దూతగా పంపంది. హైదరాబాద్ వచ్చిన ఆయన  కాంగ్రెస్ సీనియర్ నేతలను ఒక్కొక్కరితో సమావేశం అవుతున్నారు. ముందు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో భేటీ అయిన ఆయన గాంధీ భవన్ లో సీనియర్ నేతలతో మాట్లాడుతున్నారు. కమిటీల విషయంలో అభ్యంతరం ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకురావాలి కానీ ఇలా మీడియా ముందు రచ్చ చేసుకోవడం ఏమిటని దిగ్విజయ్ అన్నట్లు తెలుస్తోంది. గాంధీ భవన్ లో సీనియర్లతో దిగ్విజయ్ సింగ్ భేటీ అయిన సమయంలోనే ఉద్రిక్తత నెలకొంది. గాంధీ భవన్ బయట మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ను ఓయూ నేతలు అడ్డుకున్నారు. సేవ్ కాంగ్రెస్ అంటూ విమర్శలు చేశారు. మల్లు రవి వారిని వారించి గొడవ సద్దుమణిగేలా చేశారు.  ఇలాంటి గొడవలు, కొట్టుకోవడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని  మల్లు రవి సర్ది చెప్పారు.  కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అందరూ సమన్వయంతో పనిచేయాలని శిరసు వంచి కోరుతున్నానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలపై పోరాటం కోసం మీ శక్తినంతా వినియోగించాలి అంటూ శ్రేణులకు పిలుపునిచ్చారు. నేతల మధ్య భేదాభిప్రాయాలను దిగ్విజయ్ సింగ్ పరిష్కరిస్తారని మల్లు రవి తెలిపారు.


కోవర్టులు ఎవరూ లేరు - జానారెడ్డి 


కాంగ్రెస్ సంక్షోభంపై సీనియర్ నేత జానారెడ్డి స్పందించారు. తెంగాణ కాంగ్రెస్‌ లో కోవర్టులు ఎవరూ లేరన్నారు. అదంతా అపోహ మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. ఏ సమస్య వచ్చినా ఇంటర్నల్‌గా చర్చించుకోవాలనుకున్నామని జానారెడ్డి తెలిపారు. పార్టీ అంతర్గత విషయాలు బయటకు చెప్పలేమన్నారు. అందరం కలిసి పార్టీని పటిష్టం చేస్తామని జానారెడ్డి తెలిపారు. 


జూనియర్ , సీనియర్ పంచాయితీపై దిగ్విజయ్ అసహనం 


తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పదవుల్లో ఉన్న నేతలు కూడా కమిటీలపై అసంతృప్తి వ్యక్తం చేయడాన్ని దిగ్విజయ్‌ సింగ్ ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. కష్టకాలంలో ఉన్న పార్టీని రక్షించాల్సిన వాళ్లే సమస్యగా మారితే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కమిటీలపై ఏవైనా సమస్యలు ఉంటే అధిష్ఠానం దృష్టికి తీసుకురావాలని దిగ్విజయ్ సూచించారు. ఒక్కొక్కరితో విడిగా మాట్లాడిన ఆయన నేతల అభిప్రాయాలను నమోదు చేసుకున్నారు. పార్టీలో జూనియర్‌, సీనియర్‌ అనే భావన సరికాదన్నారు. సమస్యలు ఉంటే అధిష్ఠానం దృష్టికి తీసుకురావాలన్నారు. అంతేకానీ మీడియా ముందు మాట్లాడటం సరికాదని దిగ్విజయ్ అన్నారు. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలన్నారు. ఎవరు ఏం చేస్తున్నారో అధిష్ఠానం అన్నీ గమనిస్తోందన్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు వ్యవహరిస్తే హై కమాండ్‌ చూస్తూ ఊరుకోదన్నారు. 


ఆ పదం బాధించింది -సీతక్క 


కాంగ్రెస్ లో సంక్షోభవంపై ములుగు ఎమ్మెల్యే సీతక్క స్పందించారు. వలసవాదులు అనే పదం చాలా బాధ కలిగించిందని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మాట్లాడాక కాంగ్రెస్‌లో మార్పు వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తనకు చాలా అవకాశం ఇచ్చిందన్నారు. వలసవాదులు అనే పదం ఎందుకు వాడారో వాళ్లకే తెలియాలన్నారు.