CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన ప్రగతిభవన్ నుంచి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వచ్చారు. అక్కడ ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించారు వైద్యులు. సీఎం కేసీఆర్ వెంట ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కూడా ఆస్పత్రికి వెళ్లారు. ముఖ్యమంత్రి ఏఐజీ ఆసుపత్రిలో చేరికపై ఆసుపత్రి వర్గాల ప్రకటన చేశాయి. సీఎం కేసీఆర్ కు ఆదివారం ఉదయం పొత్తికడుపులో అసౌకర్యం ఏర్పడిందని, దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ఏఐజీ హాస్పిటల్ కు తీసుకువచ్చారని వైద్యులు తెలిపారు. ఏఐజీ హాస్పిటల్ ఛైర్మన్ నాగేశ్వర్ రెడ్డి వైద్య పరీక్షలు చేశారు. సీఎం కేసీఆర్ కు సీటీ ఎండోస్కోపీ టెస్టులు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం కడుపులో చిన్న పుండు ఉన్నట్టు గుర్తించారు వైద్యులు. సీఎం ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థాయిలోనే ఉందని, ప్రాథమికంగా కొన్ని మందులు రిఫర్ చేశామని వైద్యులు తెలిపారు.
అంతకుముందు ప్రగతిభవన్‌లో ఎమ్మెల్సీ కవిత సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. శనివారం దిల్లీలో జరిగిన ఈడీ విచారణ, ఈ నెల 16న మరోసారి విచారణ గురించి ఈ భేటీలో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా పాల్గొన్నారు. దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణ జరిగిన తీరు గురించి కవిత కేసీఆర్ కు వివరించారు. ఈడీ విచారణ జరిగిన తీరును కేసీఆర్‌కు కవిత సుదీర్ఘంగా తెలియజేశారు. ఈ నెల 16న మరోసారి విచారణకు హాజరవ్వాల్సి ఉండడంతో పలు అంశాలు చర్చించారు. విచారణలో ఎలా వ్యవహరించాలనే దానిపై సీఎం కేసీఆర్ పలు సూచనలు చేసినట్లు సమాచారం.