బాలీవుడ్ నటుడు, దర్శక నిర్మాత సతీష్ కౌశిక్(66) మృతి చెందిన విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన ఫామ్ హౌస్ గదిలో గుండెపోటుకు గురికావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. తర్వాత అక్కడే ఆయన తుది శ్వాస విడిచారు. సతీష్ కౌశిక్ మృతి తోబాలీవుడ్ లో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన మృతి పట్ల బాలీవుడ్ లో పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సతీష్ కౌశిక్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఆయన మరణానికి ముందు రాత్రి ఢిల్లీలో జరిగిన ఓ పార్టీలో ఆయన పాల్గొన్నారు. అయితే పార్టీ జరిగిన ప్రాంతం నుంచి కొన్ని ఔషధాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. దీంతో సతీష్ కౌశిక్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోస్టు మార్టమ్‌ కు ఆదేశించారు. ఇదిలా ఉంటే ఆయన గుండెపోటుకు గురైన సమయంలో సతీష్ చెప్పిన చివరి మాటలు అందర్నీ కలచివేస్తున్నాయి. 


ఇటీవల సతీష్ కౌశిక్ ఓ వ్యవసాయ క్షేత్రంలోని ఓ ఫామ్ హౌస్ లో పార్టీకి హాజరయ్యారు. అక్కడ నుంచి బయటకు వెళ్లిన కొద్ది సేపటికే ఆయన గుండెపోటుకు గురయ్యారు. అయితే సతీష్ కౌశిక్ చనిపోయిన రోజు ఆయనతో పాటు ఆయన మేనేజర్ సతీష్ రాయ్ ఉన్నారు. ఆ రోజు ఏం జరిగిందో సతీష్ రాయ్ వెల్లడించారు. బుధవారం రాత్రి భోజనం చేసిన తర్వాత ఆయనకు ఎలాంటి అసౌకర్యం కలగలేదని, తర్వాత రోజు ఉదయాన్నే ఫ్లైట్ ఉందని, త్వరగా నిద్రపోవాలని తనకు చెప్పినట్టు చెప్పారు. తర్వాత రాత్రి 11 గంటలకు తనకు ఫోన్ చేసి వైఫై సరిచేయాలని చెప్పారని తాను వచ్చి సరిచేసి.. తన గదిలోకి వెళ్లి నిద్రపోయానని అన్నారు. తర్వాత 12:05 గంటలకు సతీష్ కౌశిక్ గది నుంచి పెద్దగా అరుపులు వినిపించాయని, తాను పరుగు పరుగున వెళ్లి ఏమైంది సార్, అని అడిగానని చెప్పారు. ఆ సమయంలో ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందని, తనను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పారన్నారు. తాను వెంటనే కారులో ఆసుపత్రికి తీసుకెళ్లామని చెప్పారు. 


తాము ఆసుపత్రికి వెళ్లేసరికి ఆయనకు ఛాతిలో నొప్పి ఎక్కువైందని చెప్పారు. తర్వాత నా భుజం మీద తల పెట్టుకొని ‘‘సంతోష్ నాకు చావడం ఇష్టం లేదు. నన్ను కాపాడు. నేను వంశిక(కూతురు) కోసం జీవించాలి. నేను బతకలేనని అనుకుంటున్నాను. శశి, వంశికలను జాగ్రత్తగా చూసుకోండి’’ అని చెప్పారని అన్నారు. తర్వాత ఆయన స్పృహ తప్పి పడిపోయారని అన్నారు. తర్వాత ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.


కౌశిక్ చివరి మాటలు అందర్నీ కలచివేస్తున్నాయి. మార్చి 9న ముంబై లో ఆయన అంత్యక్రియలు జరిగాయి. సతీష్ కౌశిక్ కు భార్య శశి, కుమార్తె వంశిక ఉన్నారు. సతీష్ కౌశిక్ హరియాణాలోని మహేంద్రఘడ్‌ లో 1956లో జన్మించారు. 1983లో వచ్చిన 'మాసూమ్'తో నటుడుగా కెరీర్ ను ప్రారంభించారు సతీష్. తర్వాత పలు సినిమాలకు రచయితగా పనిచేశారు. తర్వాత దర్శకుడిగా, నిర్మాతగా  మారారు. సుమారు 15 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఆయన తీసిన చివరి సినిమా 'కాగజ్'.


Read Also: ‘నాటు నాటు’ పాట ఆస్కార్ మాత్రమే కాదు, ఆ అవార్డు కూడా గెలవాలి : ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ ఆకాంక్ష