95వ ఆస్కార్ అవార్డుల వేడుకకు సర్వం సిద్ధం అయ్యింది. మరికొద్ది గంటల్లో ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ ప్రారంభం కానుంది. ‘RRR’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ గెలవాలని కోట్లాది మంది భారతీయులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆస్కార్ విజేత, దిగ్గజ భారతీయ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు వెల్లడించారు. "’నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఆస్కార్ మాత్రమే కాదు, గ్రామీ అవార్డును సైతం అందుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే. ఈ అవార్డులలో ఏది వచ్చినా, భారత కీర్తిని మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుంది” అని రెహమాన్ అభిప్రాయపడ్డారు. రెహమాన్ ఆశ కచ్చితంగా నెరవేరుతుందని నెటిజన్లు అంటున్నారు. ఆయన చెప్పినట్లుగానే ‘నాటు నాటు’ పాట ఆస్కార్, గ్రామీని దక్కించుకుంటుందంటున్నారు.
ఆస్కార్, గ్రామీ అవార్డులను గెల్చుకున్న రెహమాన్
ఇక ఏఆర్ రెహమాన్ రెండు ఆస్కార్ అవార్డులను అందుకున్నారు. 2009లో ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ మూవీలోని ‘జయహో’ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీల్లో ఆస్కార్ అవార్డులను అందుకున్నారు. అంతేకాదు, రెహమాన్ ప్రస్తుతం అకాడమీ మోషన్ పిక్చర్, ఆర్ట్స్ అండ్ సైన్సెస్ లో ఆయన కొనసాగుతున్నారు. రెహమాన్ చెప్పినట్లుగా ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ వస్తే, ఈ కేటగిరీలో అవార్డు అందుకున్న తొలి భారతీయ చిత్రంగా ‘RRR’ నిలవనుంది. రెహమాన్ ఈ విభాగంలో అవార్డు అందుకున్నా, అది హాలీవుడ్ సినిమా కోసం రూపొందించిన సాంగ్. ‘RRR’ అనేది పూర్తి భారతీయ చిత్రం.
ప్రతి ఏటా ఆస్కార్ నామినేషన్స్ లో నిలవాలి- రెహమాన్
గతంలోనూ రెహమాన్ ‘నాటు నాటు’ పాట ఆస్కార్ కు నామినేషన్ అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జనవరిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు కీలక విషయాలు వెల్లడించారు. “భారత్ నామినేషన్ లోకి వచ్చి సుమారు 12 ఏండ్లు అయ్యింది. ఇప్పుడు ‘RRR’ పాట నామినేషన్ అందుకుంది. ఇకపై ప్రతి ఏటా భారతీయ సినిమాలు నామినేషన్ దక్కించుకోవాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నమం 130 కోట్ల మంది జనాభా కలిగి ఉన్నాం. ప్రతి విభాగంలో మంచి మేధావులు ఉన్నారు. కానీ, చాలా సినిమాలు పోటీలోకి కూడా రావడం లేదు. ‘RRR’ సినిమా ఈ సారి బలంగా పోటీలోకి దిగింది. ‘RRR’ టీమ్ కు అభినందనలు చెప్తున్నాను. అవార్డు గెలవాలని ఆకాంక్షిస్తున్నాను” అన్నారు.
ఆస్కార్ వేదికపై రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఫర్ఫార్మెన్స్
ఇక ‘RRR’ మూవీలోని ‘నాటు నాటు’ సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ కు నామినేషన్ దక్కించుకుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఎస్ఎస్ రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అమెరికాలో ఉన్నారు. మార్చి 12న (భారతదేశంలో మార్చి 13న) ప్రతిష్టాత్మక 95వ అకాడమీ అవార్డ్స్ వేడుక జరుగనుంది. ‘నాటు నాటు’ సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ఆస్కార్ వేదికపై పాటను పాడనున్నారు. లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం జరగనుంది.
Read Also: అవార్డులను చూస్తే అహంకారం వస్తుంది: కీరవాణి - ఆయన ఇల్లు, లైఫ్‌స్టైల్ చూశారా?